Mahaa Daily Exclusive

  కలియుగ వైకుంఠంలో స్వచ్ఛత వెలుగులు..! ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తిరుమల..

Share

  • అణువణువునా అద్దంలాంటి నిర్మలత్వం!
  • వ్యర్థాల నిర్వహణలో టీటీడీ సరికొత్త రికార్డు.
  •  ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తిరుమల.
  • రూ. 19.75 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్.
  • 3 జోన్లు, 7 వార్డులుగా విభజించి టీటీడీ అద్భుత నిర్వహణ.

 

తిరుమల,మహా.

 

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల, కేవలం భక్తికి మాత్రమే కాకుండా, పారిశుధ్యం , పర్యావరణ పరిరక్షణలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతోంది. నిత్యం 80 వేల నుంచి లక్ష మంది భక్తులు సందర్శించే ఈ పవిత్ర క్షేత్రంలో, కేవలం 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇంతటి భారీ జనసమూహాన్ని నిర్వహిస్తూనే, ఎక్కడా చిన్నపాటి అపరిశుభ్రత కూడా కనిపించకుండా టీటీడీ యంత్రాంగం చేస్తున్న కృషి అనిర్వచనీయం. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల కొండను మూడు ప్రధాన జోన్లు మరియు ఏడు వార్డులుగా విభజించి, ప్రతి అంగుళాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అద్దంలా తీర్చిదిద్దుతున్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

పర్యావరణ హితమే పరమావధిగా సాగుతున్న టీటీడీ ప్రయాణంలో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించడం ఒక మైలురాయిగా నిలిచింది. 2025 సంవత్సరం నాటి గణాంకాలను పరిశీలిస్తే, తిరుమల వ్యర్థాల నిర్వహణలో ఎంతటి పకడ్బందీగా ఉందో అర్థమవుతుంది. ఏడాది పొడవునా సుమారు 16,689 మెట్రిక్ టన్నుల జీవ వ్యర్థాలను 8,221 మెట్రిక్ టన్నుల అకర్బన వ్యర్థాలను కలిపి మొత్తం 24,911 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను అత్యంత శాస్త్రీయంగా నిర్మూలించారు. ఇందుకోసం 9 ప్రత్యేక వాహనాలు ప్రతిరోజూ 45 ట్రిప్పులు తిరుగుతూ, క్షేత్రవ్యాప్తంగా ఉన్న 3,056 చెత్త కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నాయి. ట్రేడ్ లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా వ్యాపార సంస్థలు కూడా పర్యావరణ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకున్నారు.

భక్తుల ప్రాథమిక అవసరాల విషయంలో టీటీడీ రాజీలేని పద్ధతులను అవలంబిస్తోంది. క్షేత్రవ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం 354 టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మొబైల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ద్వారా భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని చెంతకే చేరుస్తున్నారు. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా భక్తులకు అందించే ఆహారం మరియు నీటి నాణ్యత విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఇప్పటికే ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తుండగా, మరింత అత్యాధునిక సాంకేతికతతో రూ. 19.75 కోట్ల వ్యయంతో కొత్త ఫుడ్ ల్యాబ్‌ను నిర్మించారు. దీనివల్ల శ్రీవారికి సమర్పించే నైవేద్యం నుంచి భక్తులకు పంపిణీ చేసే అన్నప్రసాదం వరకు ప్రతిదీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా చూస్తున్నారు.

ఇంతటి భారీ స్థాయిలో భక్తుల నిర్వహణ చేస్తూ పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలవడం అనేది దేశంలోని ఇతర పుణ్యక్షేత్రాలకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు అక్కడి పరిశుభ్రతను చూసి ముగ్ధులవుతున్నారు. భక్తుల నుంచి వస్తున్న సానుకూల స్పందన టీటీడీ యంత్రాంగం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఆధునిక సాంకేతికతను ఆధ్యాత్మిక సేవలతో మేళవించి, ప్రకృతి ఒడిలో వెలిసిన వేంకటేశ్వరుని సన్నిధిని అత్యంత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచడంలో టీటీడీ విజయవంతమైంది. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ, మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుమల క్షేత్రం నేడు భక్తికి మాత్రమే కాదు, స్వచ్ఛతకు కూడా మారుపేరుగా నిలిచింది.