- సాగునీటి లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన.
- అహర్నిశలూ శ్రమించాలి: మంత్రి ఉత్తమ్.
హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని, 2027-28 సాగునీటి సీజన్ నాటికే ఆనకట్టలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా డిజైన్ల బృందం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పురోగతిపై కీలక దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టును త్వరితగతిన గాడిలో పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రాబోయే రెండేళ్ల కాలాన్ని అత్యంత కీలకంగా పరిగణించి, మేడిగడ్డ బ్యారేజీని కనీసం పాక్షికంగానైనా వాడుకలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ పునరుద్ధరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన డిజైన్ల రూపకల్పనపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం నియమించిన ఇంజనీరింగ్ నిపుణుల బృందం అహర్నిశలూ శ్రమించి త్వరితగతిన డిజైన్లను సిద్ధం చేయాలని, అప్పుడే వాటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపి తుది అనుమతులు పొందగలమని ఆయన వివరించారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను సమన్వయం చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం బ్యారేజీల వద్ద జరుగుతున్న ఇసుక తొలగింపు ప్రక్రియతో పాటు, అత్యాధునిక జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) పరీక్షల ద్వారా నిర్మాణాల పటిష్టతను అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వివిధ ఏజెన్సీల సహకారంతో జరుగుతున్న ఈ పరీక్షల ఫలితాల ఆధారంగానే శాశ్వత పునరుద్ధరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా, గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా పారదర్శకతతో ఈ భగీరథ ప్రయత్నాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు , సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.








