- బైపీసీలో 993 మార్కులతో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు కైవసం.
హనుమకొండ, మహా
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో తొర్రూరు ప్రాంతానికి చెందిన గడల రాంచరణ్ అసాధారణ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో మెరిశారు. హనుమకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాంచరణ్, బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఏకంగా 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంకును కైవసం చేసుకున్నారు. గతేడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన రాంచరణ్, అదే పట్టుదలను ద్వితీయ సంవత్సరంలోనూ కొనసాగించి తన ప్రతిభను మరోసారి విద్యాలోకానికి చాటిచెప్పారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన పట్టుదలే తన విజయానికి మూలమని ఈ సందర్భంగా రాంచరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రాంచరణ్‌తో పాటు ప్రతిభ జూనియర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం. అంజలి అనే విద్యార్థిని 994 మార్కులు సాధించి కళాశాలలో అగ్రస్థానంలో నిలవగా, జి. కీర్తన 991 మార్కులతో తన ప్రతిభను చాటుకుంది. ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఏ. శ్రావణి 466 మార్కులు, వి. తిరుపతి 465 మార్కులు, ఈ. తరుణ్ 461 మార్కులు సాధించి కళాశాలకు పేరు తెచ్చారు. ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ అగ్రగామిగా నిలుస్తున్న తమ కళాశాల విద్యార్థులు ఈసారి కూడా రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయదుందుభి మోగించడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఈ ఘన విజయంపై ఆదివారం సాయంత్రం ప్రతిభ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు కెఎల్ఎన్ ఆచార్య, కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, శ్రవణ్ రావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ.. విద్యార్థుల కృషితో పాటు అధ్యాపక బృందం అందించిన సరైన దిశానిర్దేశం వల్లే ఈ అద్భుతమైన మార్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రతిభ కళాశాల ప్రత్యేకతను నిలబెట్టిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వారు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాంచరణ్ వంటి విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.








