Mahaa Daily Exclusive

  క్లీన్ ఎనర్జీలో ‘సిద్దిపేట’ నమూనా..! ప్లాంట్ శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి..

Share

  • రూ.700 కోట్లతో బయో గ్యాస్ ప్రాజెక్టు.
  • గ్రామాలే ఇంధన కేంద్రాలుగా మారాలి.
  •  1400 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం.
  •  ప్లాంట్ శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.

 

సిద్దిపేట, మహా.

స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్ట వేదికగా ఒక బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. సుమారు రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో ‘జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం భూమి పూజ చేశారు. కేవలం పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 90 శాతం ముడి చమురు, 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్న తరుణంలో, క్లీన్ ఎనర్జీ ఒక్కటే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన ఉద్ఘాటించారు. పరిశ్రమలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా గ్రామాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వరి గడ్డి, ఆవు పేడ, కోళ్ల వ్యర్థాల వంటి వ్యవసాయ అనుబంధ వనరులను వినియోగించుకోవడం ద్వారా రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా, దేశానికి ఇంధనాన్ని అందించే ‘ఊర్జదాతలుగా’ చరిత్ర సృష్టిస్తారని ఆయన ప్రశంసించారు.

ఈ భారీ ప్రాజెక్టును మూడు దశల్లో క్లస్టర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 సీబీజీ ప్లాంట్ల ద్వారా బయో ఫ్యూయల్ గ్యాస్ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 1400 మందికి ఉపాధి లభిస్తుందని, అందులో 30 శాతం మంది మహిళలకు అవకాశం కల్పించడం విశేషమని మంత్రి తెలిపారు. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించే ఇటువంటి పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు, భరోసా కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గడ్డను గమ్యస్థానంగా మార్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లా పారిశ్రామికంగా మరో మైలురాయిని అధిగమించబోతోందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest