Mahaa Daily Exclusive

  దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు..! అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి..

Share

  • పదేళ్ళ విధ్వంసం..వందేళ్ళ నష్టానికి దారి తీసింది
  • దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లు
  • స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో
  • దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉంది
  • అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా : దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లని, స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మా కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. గతంలో భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే ఓర్వలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్, పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. 67వేల ఉద్యోగాల్లో 87శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయని వెల్లడించారు.

 

పదేళ్ల విధ్వంసం.. వందేళ్ల నష్టానికి దారి తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ.. తప్పులు సరిదిద్దుతూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 50 శాతం జనాభా ఆధారంగా.. మరో 50 శాతం జీఎస్‌డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. కానీ లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు

 

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత సర్కారు పాలనతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని అంబేడ్కర్‌ మార్గదర్శనం చేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దక్షిణాదిన కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గి సీట్లు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామన్నారని తెలిపారు. కేంద్రం ఆదేశాలు పాటించి జనాభా నియంత్రణ పాటిస్తే నష్టం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టంపై అభ్యంతరం లేవనెత్తామని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలు పాటిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా సీఎం ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని అంబేడ్కర్‌ చెప్పారని, రాజ్యాధికారం సాధించాలంటే సీట్ల సంఖ్య పెరగాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిన రాష్ట్రం తెలంగాణ అని, జనగణనతో పాటు కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.

Latest