Mahaa Daily Exclusive

  ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా.. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..: మంత్రి పొన్నం ప్రభాకర్..

Share

  • సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
  • ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మహా : ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఈ రెండు అంశాలు తప్ప మిగతా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎల్లవేళలా తమ తలుపులు తెరిచి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని ఎన్నికల షెడ్యుల్ కు 10 రోజులకు ముందు హడావిడిగా విలీనం అంశాన్ని ముందుకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం ఈ మూడు అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై సంస్థ మరియు ఉద్యోగుల అంశాలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు.

 

ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని, ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని విజ్ఞప్తి చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని చెప్పారు. ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి కోరారు.

Latest