Mahaa Daily Exclusive

  అంబేద్కర్ స్పూర్తితోనే మహిళా రిజర్వేషన్ల అమలు..అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

Share

  • ప్రతి ఒక్కరూ మహిళా బిల్లుకు మద్దతివ్వాలి
  • అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మహా : మహిళలకు సమానత్వ హక్కు కోసం పోరాడిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితోనే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టబోతోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ… అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి… రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే అంబేద్కర్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాల్సిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగుల్లో కష్టపడి చదువుకుని ప్రపంచమే గర్వించే స్థాయిలో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేధావి అంబేద్కర్. మన పొరుగు దేశాలతోసహా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతూ రాచరిక పాలన కొనసాగుతున్న పరిస్థితుల్లో…. 140 కోట్ల భారత్ నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా వర్ధిల్లుతుందంటే అది అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగమే. స్త్రీ సమానత్వం కోసం పోరాడిన మహనీయుడన్నారు.

Latest