• అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించిన ఎన్. రామచంద్రరావు.
హైదరాబాద్, మహా.
భారత రాజ్యాంగ నిర్మాత, నవ భారత నిర్మాణ వైతాళికుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆనంద్‌బాగ్‌లో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉన్నత విలువల పునాదులపై ఒక బలమైన, న్యాయబద్ధమైన భారతదేశాన్ని నిర్మించేందుకు అంబేద్కర్ స్పష్టమైన రూపాన్ని ఇచ్చారని కొనియాడారు.
సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి వ్యక్తికి హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు దక్కాలనే ఉదాత్త లక్ష్యంతోనే బాబాసాహెబ్ తన జీవితాన్ని అంకితం చేశారని రామచంద్రరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన రాసిన రాజ్యాంగం నేడు దేశంలోని కోట్లాది మంది అణగారిన వర్గాలకు రక్షణ కవచంలా నిలుస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందడమే నిజమైన నివాళి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు విశేష సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు. విగ్రహ పరిసర ప్రాంతాలు జై భీమ్ నినాదాలతో మారుమోగాయి.








