Mahaa Daily Exclusive

  వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాం..! కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు..

Share

  • గాంధీ, పటేల్, మోదీ పుట్టిన నేలకు రావడం సంతోషంగా ఉంది
  • జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద వ్యవస్థను బలహీనపర్చాం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం కాన్వకేషన్ లో
  • రాష్ట్రపతితో కలిసి పాల్గొన్న కేంద్ర మంత్రి

ఢిల్లీ, మహా.

వామపక్ష తీవ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించాలనే లక్ష్యాన్ని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దీంతోపాటు జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థను గణనీయంగా బలహీనపరిచామన్నారు. సమగ్ర పాలన, అంతర్-ఏజెన్సీ సమన్వయం, లక్ష్యాధారిత అంతర్గత భద్రతా నిర్వహణ దిశగా జరిగిన విస్తృత మార్పుద్వారా ఈ ఫలితాలు వచ్చాయన్నారు.

 

గుజరాత్ లోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐదవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయి రజనీకాంత్ పటేల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

 

*కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్* :

 

గుజరాత్ ఈ పవిత్ర భూమిపై నేడు రావడం నాకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తోంది. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, దయానంద సరస్వతి, ప్రధాన మంత్రి మోదీ వంటి మహానుభావులు పుట్టిన గుజరాత్ కు రావడం చాలా సంతోషంగా ఉంది.

 

రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఐదవ కన్వకేషన్ వేడుక సందర్భంగా డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులకు అభినందనలు. రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా సంస్థ మాత్రమే కాదు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ కూడా. ఇది జాతీయ భద్రత, పోలీస్ వ్యవస్థ, వ్యూహం, చట్టం, సాంకేతికత, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశ దీర్ఘకాల అవసరాలను తీర్చడానికి స్థాపించబడింది.

 

భారత సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, కేంద్ర మరియు రాష్ట్ర పోలీసు సంస్థలు, గూఢచారి దర్యాప్తు సంస్థలు కలిసి భారత విస్తృత భద్రతా వ్యవస్థను నిర్మిస్తున్న ప్రతి ఒక్కరి సేవలను నేను అభినందిస్తున్నా. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక పాత్ర ఉన్నప్పటికీ, అందరూ ఒకే జాతీయ లక్ష్యం కోసం అనుసంధానమై ఉన్నారు.

 

గత కొన్ని సంవత్సరాలలో, భారత ప్రభుత్వం అంతర్గత భద్రతా వ్యవస్థలో కీలకమైన మార్పులు చేసింది. గృహ మంత్రిత్వ శాఖ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైబర్ భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ, నూతన న్యాయ చట్టాల అమలు , సమన్వయ భద్రత–అభివృద్ధి వ్యూహం ద్వారా వామపక్ష ఉగ్రవాదాన్ని దాదాపు పూర్తిగా నిర్మూలించడంలో పురోగతి సాధించింది. భారత ప్రభుత్వం 31 మార్చి 2026 నాటికి వామపక్ష ఉగ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించాలనే సంకల్పాన్ని ప్రకటిండమే కాకుండా విజయవంతంగా లక్ష్యానికి చేరుకుంది. జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థను గణనీయంగా బలహీనపరిచింది. సమగ్ర పాలన, అంతర్-ఏజెన్సీ సమన్వయం, లక్ష్యాధారిత అంతర్గత భద్రతా నిర్వహణ దిశగా జరిగిన విస్తృత మార్పుద్వారా ఈ ఫలితాలు వచ్చాయి.

 

“ఈరోజు రక్షణ రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే సరిపోదు.” అని “టెక్నాలజీని అర్థం చేసుకునే, మానవ మనస్తత్వాన్ని గ్రహించే, యువతతో సంభాషించే విధానాలను తెలిసి సమగ్ర శిక్షణ పొందిన మనుషుల అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ విశ్వవిద్యాలయాన్ని దేశానికి అంకితం చేస్తూ స్పష్టంగా చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ అనుసరణీయం.

 

అట్లాగే “ఈ రంగంలో ప్రాథమిక మార్పు రావాలంటే ప్రొఫెషనలిజం ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2022 కన్వకేషన్ వేడుకలో భద్రత గురించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని ఒక నిపుణుడిగా మాత్రమే కాకుండా నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దుతోంది.

 

భద్రత , స్వేచ్ఛ ఒకదానిని మరొకటి బలపరచేలా ఉండాలే తప్ప బలహీనపరచకూడదు. అట్లాగే సాంకేతికత న్యాయానికి సేవ చేయాలి. జాతీయ సేవకు ధైర్యం, వ్యక్తిత్వం రెండూ అవసరం. జాతీయ రక్షా విశ్వవిద్యాలయం పై అంశాలతో విద్యార్థులను సిద్ధం చేసింది.

 

జాతీయ రక్షా విశ్వవిద్యాలయం కులపతి, అధ్యాపకులు, అధికారులు, సిబ్బందికి భారత అంతర్గత భద్రతా ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ సంస్థను నిర్మించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టభద్ర విద్యార్థులకు, వారి కుటుంబాలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, భారతదేశం పట్ల గాఢమైన కర్తవ్యనిబద్ధతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

Latest