Mahaa Daily Exclusive

  భూమి లేకున్నా ‘పట్టా’ మాయాజాలం: రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అక్రమాల పర్వం.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.

Share

భూమి లేదు.. కానీ ‘పట్టా’ ఉంది.
*రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అక్రమాల పర్వం.
*నాలా పన్ను ఎగ్గొట్టి ‘ఫాం ల్యాండ్స్’ పేరిట ప్లాట్ల విక్రయాలు.
* ఎకరానికి రూ. లక్ష ‘మామూలు’ ఉంటేనే మ్యుటేషన్.
*ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. కడ్తాల్, ఆమంగల్ మండలాల్లో వందల సంఖ్యలో అక్రమ ఉదంతాలు.
హైదరాబాద్‌, మహ.
హైదరాబాద్‌ మహానగరం చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, అక్రమార్కుల కన్ను రెవెన్యూ రికార్డులపై పడింది. క్షేత్రస్థాయిలో అసలు భూమే లేకపోయినా, కాగితాల్లో మాత్రం సాగు భూమి ఉన్నట్లు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్న వైనం రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా జిల్లాలోని కడ్తాల్ మండలంలో వెలుగుచూసిన ఈ ఉదంతం రెవెన్యూ శాఖలోని లోతైన అవినీతికి అద్దం పడుతోంది. వ్యవసాయ భూమి ఉండాల్సిన చోట ఇళ్లు ఉన్నట్లు వర్గీకరించడం, లేని భూమికి పట్టాలు సృష్టించడం వంటి అక్రమాలు కడ్తాల్‌తో పాటు ఆమంగల్ మండలాల్లో వందల సంఖ్యలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వ్యవస్థలను సైతం అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
**ముడుపులు ముడితేనే మ్యుటేషన్ పనులు**
సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ యాంత్రికంగా జరిగి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావాలి. కానీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఆన్‌లైన్ వ్యవస్థలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు, ఒక్కో ఎకరానికి రూ. లక్ష చొప్పున లంచం ఇస్తే తప్ప ఫైలును ముందుకు కదపడం లేదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ జరగకుండా అడ్డంకులు సృష్టిస్తూ, బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి మధ్యవర్తుల ద్వారా లక్షల్లో సొమ్ములు ముడితేనే డిజిటల్ సంతకాలు పెట్టి పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ల దందా ఏ స్థాయికి చేరిందంటే, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే కార్యాలయాల్లో కూర్చుని ప్లాట్లను వ్యవసాయ భూములుగా చూపుతూ కొత్త పాసుపుస్తకాలు సృష్టిస్తున్నారు.
**నాలా ఎగ్గొట్టి ‘ఫాం ల్యాండ్’ పేరిట మాయాజాలం**
వ్యవసాయ భూమిని వాణిజ్య లేదా గృహ నిర్మాణ అవసరాలకు మార్చాలంటే ప్రభుత్వానికి కచ్చితంగా నాలా పన్ను చెల్లించాలి. కానీ రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, చేవెళ్ల, శంకర్ పల్లి వంటి ప్రాంతాల్లో నాలా పన్ను ఎగ్గొట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సరికొత్త దారి వెతికారు. వ్యవసాయ భూమిని లేఅవుట్లుగా మార్చి, వాటిని ‘ఫాం ల్యాండ్స్’ పేరిట అర ఎకరా నుంచి ఎకరా లోపు ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఈ పద్ధతిలో భూమిని వ్యవసాయ భూమిగానే చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక్కడ అసలు మతలబు ఏమిటంటే, స్థిరాస్తి వ్యాపారులే అధికారులకు భారీగా లంచాలు ఇచ్చి, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పక్కదారి పడుతోంది.
**అవినీతి తిమింగలాలు.. ఏసీబీకి చిక్కినా మారని తీరు**
రెవెన్యూ శాఖలో వేళ్లూనుకున్న అవినీతికి నిదర్శనంగా గతంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. కేశంపేట తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాల జారీ కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సోదాల్లో ఆయన వద్ద రూ. 90 లక్షల అక్రమ ఆస్తులు బయటపడటం అధికారుల బరితెగింపునకు నిదర్శనం. అలాగే ఘట్‌కేసర్ పరిధిలో పదివేల గజాల చొప్పున ప్లాట్లు చేసి, వాటిని వ్యవసాయ భూములుగా చూపి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రూ. 50 వేల చొప్పున వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఒకే భూమికి రెండు పాసుపుస్తకాలు జారీ అయిన ఉదంతం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. చివరకు దేశాన్ని కాపాడే విశ్రాంత ఆర్మీ అధికారులను సైతం వదలకుండా, వారి భూములు అప్పగించేందుకు లంచాలు డిమాండ్ చేసిన ఘటనలు ఇక్కడ వెలుగుచూశాయి.
**చక్రం తిప్పుతున్న రియల్ మాఫియా**
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో సాగు భూమి ధర కోట్లకు చేరడంతో, ప్రతి ఎకరాపై లక్షల రూపాయల ఆదాయం పొందేందుకు అధికారులు, బ్రోకర్లు ఏకమయ్యారు. స్థిరాస్తి వ్యాపారులే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు ముందే అధికారులతో ధరలు నిర్ణయించి, అక్రమ లేఅవుట్లకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని అడ్డుకుంటూ, వ్యక్తిగత లాభాల కోసం భూ రికార్డులను తారుమారు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన భూ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జారీ అయిన పాసుపుస్తకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న లంచావతారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.