Mahaa Daily Exclusive

  నామినేటెడ్ పోస్టులకు ‘గ్రీన్ సిగ్నల్’!

Share

• మరో రెండు రోజుల్లో పదవుల జాతర.
• మంత్రుల పనితీరుపై పోస్ట్‌మార్టం.
• ఇండియా కూటమి భేటీకి మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.
* మూడు గంటల పాటు మీనాక్షి నటరాజన్ సుదీర్ఘ కసరత్తు.

హైదరాబాద్, మహా.

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వంపై పట్టు పెంచుకుంటూనే, మరోవైపు పార్టీలో అసమ్మతి సెగలను చల్లార్చేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. బుధవారం గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన హైలెవల్ మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లతో కలిసి ఆమె సుమారు మూడు గంటల పాటు మారథాన్ సమీక్ష నిర్వహించారు. మంత్రుల పనితీరు, వారిపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా ఉదంతం వంటి సున్నితమైన అంశాలపై ఈ భేటీలో లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా అసంతృప్త నేతలను ఎలా బుజ్జగించాలనే అంశంపై మీనాక్షి నటరాజన్ కీలక దిశానిర్దేశం చేశారు.
**కార్యకర్తలకు పండగే.. నామినేటెడ్ పదవులకు రూట్ క్లియర్!**
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్‌పై ఆయన సానుకూలంగా స్పందించారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతానికి ఈ నియామకాలు టానిక్‌లా పనిచేస్తాయని, ముఖ్యంగా జిల్లా స్థాయి పదవుల భర్తీతో క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు బిగిస్తుందని అధినాయకత్వం భావిస్తోంది.
**68వ సారి ఢిల్లీ బాట.. ‘ఇండియా’ కూటమిలో రేవంత్ కీలకం**
రాష్ట్రంలో సమీక్ష ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయనకు 68వ ఢిల్లీ పర్యటన కావడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నిర్వహించే అత్యంత కీలకమైన సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై గళమెత్తాలని, కూటమి నేతలతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని రేవంత్ యోచిస్తున్నారు. ఈ పర్యటనలో ఏఐసీసీ అగ్రనేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించే అవకాశం ఉంది.
**మేడిగడ్డ గడ్డపై రేవంత్ పర్యటన.. పుష్కర ఏర్పాట్లపై సమీక్ష**
పాలనలో తనదైన ముద్ర వేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన స్వయంగా సందర్శించనున్నారు. అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న జియో ఫిజికల్ పరీక్షలు, పునరుద్ధరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయనున్నారు. వీటితో పాటు కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘సరస్వతి అంత్య పుష్కరాల’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అటు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతూనే, ఇటు పాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి దూకుడు పెంచడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.