Mahaa Daily Exclusive

  మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ‘పైలట్’కు పెరుగుతున్న చిక్కులు: తెరపైకి దుబాయ్ కేదార్ మృతి వ్యవహారం

Share

  • మొయినాబాద్ డ్రగ్స్ కేసు
  • ‘పైలట్’కు బిగుస్తున్న ఉచ్చు
  • తెరపైకి దుబాయ్ లో చనిపోయిన కేదార్ కేసు
  • డ్రగ్స్‌ ఓవర్‌డోస్‌తో చనిపోయిన వ్యక్తితో సంబంధాలు

హైదరాబాద్, మహా : సంచలనం రేపిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి మరిన్ని చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తి పేరును సిట్ అధికారులు ప్రస్తావించారు.

కేదార్ అనే వ్యక్తి పేరు మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్‌లో తెరమీదికి వచ్చింది. గతేడాది దుబాయ్‌లో డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఓవర్ డోస్‌తో కేదార్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ కేదార్‌తో పైలట్ రోహిత్‌ రెడ్డి సోదరులకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. కేదార్ కు రోహిత్‌ రెడ్డికి మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. అదే సమయంలో చాలా మంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు కూడా అనేక సార్లు డబ్బులు పంపించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వివరించారు. రితేష్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి కేదార్‌కు రూ. 25 లక్షలు రోహిత్ రెడ్డి ట్రాన్సాక్షన్లు చేసినట్లు విచారణలో తేలింది. ఈ రూ.25 లక్షల ట్రాన్సాక్షన్ గురించి కూడా విచారణలో పైలట్ రోహిత్ రెడ్డి , రితేష్ రెడ్డి.. సరైన సమాధానాలు చెబుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు పిటిషన్‌లో తాజాగా ఈ అంశాలను పోలీసులు పేర్కొన్నారు.

ఈ మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్‌ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తోంది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్‌ అధికారులు.. నిందితులను విచారణ చేయడంతోపాటు.. ఈ కేసులో మరిన్ని విషయాలను బయటికి తీసుకు వస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీతోపాటు.. ఆ పార్టీకి డ్రగ్స్‌ను సరఫరా చేసింది ఎవరు.. ఆ నెట్‌వర్క్ ఏంటి.. వారితో దుబాయ్‌కు ఉన్న సంబంధాలు ఏంటి అనేది కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దుబాయ్ లో ఓవర్ డోస్ తో కేదార్ మరణించారు. అప్పట్లోనే ఆయన మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. తాజాగా పైలట్ కేసులో కేదార్ అంశఁ వెలుగులోకి రావడంతో మరింత ఆసక్తి నెలకొంది.