Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌ ముసుగులో అధికార చోరీకి బీజేపీ యత్నం…

Share

*మహిళా బిల్లుకు మా మద్దతు.. కానీ ఆ కుట్రలను సహించం.
*దక్షిణాది రాష్ట్రాలకు, ఓబీసీలకు తీరని అన్యాయం..
* భాజపా ఎత్తుగడలను అడ్డుకుంటాం.
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.
ఢిల్లీ, మహా.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ‘అధికార చోరీ’కి పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేస్తూనే, ఆ బిల్లు అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనేది మంచి నిర్ణయమైనప్పటికీ, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ విపక్షాలను, నిర్దిష్ట వర్గాలను అణచివేసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.
**బడుగు వర్గాల హక్కుల హరణే లక్ష్యం**
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను లాక్కునేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోందని రాహుల్‌గాంధీ విమర్శించారు. జనాభా గణనను చేపట్టకుండా, కేవలం రాజకీయ లెక్కలతో నియోజకవర్గాలను పునర్విభజించడం వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది కేవలం సీట్ల పెంపు కాదు, బడుగు వర్గాల గొంతు నొక్కే ప్రయత్నం” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అసలైన సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని, అది లేకుండా చేసే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండదని స్పష్టం చేశారు. ఈ కుట్రలను అడ్డుకుని, అణగారిన వర్గాల హక్కుల కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
**దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం**
ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల చిన్న రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రాహుల్‌గాంధీ హెచ్చరించారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు బహుమతి ఇవ్వాల్సింది పోయి, వాటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఏంటని ఆయన నిలదీశారు. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని, భవిష్యత్తులో పార్లమెంటులో దక్షిణాది స్వరం బలహీనపడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోందని ఆరోపించారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
**అధికార దాహంతోనే ఇవన్నీ..**
మహిళా రిజర్వేషన్ల అమలును ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యం చేశారని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల ముందు డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక అధికార దాహం తప్ప ప్రజల పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్లమెంటు లోపల, వెలుపల డీలిమిటేషన్ అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ప్రజల ఆస్తులను, హక్కులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని రాహుల్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు.

Latest