Mahaa Daily Exclusive

  మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలపండి: ఎంపీలు, రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ

Share

మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలపండి.
* పార్టీలకు, ఎంపీలకు చంద్రబాబు లేఖ.
*నారీ శక్తి వందన్‌ బిల్లుపై ఏకతాటిపైకి రావాలని పిలుపు.
అమరావతి, మహా.
మహిళా సాధికారత దిశగా దేశం వేస్తున్న విప్లవాత్మక అడుగు ‘నారీ శక్తి వందన్ అధినియం’ చట్ట సవరణ బిల్లుకు బేషరతుగా మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుస్తూ, ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, ఉభయ సభల ఎంపీలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. 2029 ఎన్నికల నాటికే మహిళలకు మూడో వంతు సీట్లు దక్కేలా తీసుకువస్తున్న ఈ బిల్లును పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
**చట్టసభల్లో మహిళా భాగస్వామ్యంతోనే నిజమైన ప్రగతి**
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఏప్రిల్ 16వ తేదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చంద్రబాబు అభివర్ణించారు. కేవలం చట్టాల రూపకల్పనతోనే కాకుండా, పరిపాలనలో మరియు నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తాను నమ్ముతానని లేఖలో పేర్కొన్నారు. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, అది దేశ ఉన్నతికి దోహదపడే విప్లవాత్మక మార్పు అని ఆయన స్పష్టం చేశారు. భరతమాతను పూజించే సంస్కృతి కలిగిన మన దేశంలో నారీ శక్తికి వందనం పలుకుతూ, చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
**పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి**
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రూపొందిన ఈ బిల్లు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా మహిళల పట్ల మనకున్న గౌరవాన్ని, అంకితభావాన్ని చాటుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు అతీతంగా, భావితరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు జై కొట్టాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో జరిగే ఈ చారిత్రక చర్చలో అందరూ క్రియాశీలకంగా పాల్గొని బిల్లు ఆమోదానికి సహకరించాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.

Latest