ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేష్ బట్టిని.
*హైదరాబాద్లో బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేష్ బట్టిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయపు పన్ను పరిపాలనలో అత్యున్నత స్థాయి అధికారిగా ఆయన నియామకం కావడంతో, విధుల్లో చేరి బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా సురేష్ బట్టినికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ కుటుంబం అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ రాకతో శాఖా పరమైన కార్యకలాపాల్లో కొత్త వేగం పుంజుకుంటుందని, ఆయన నాయకత్వంలో పన్ను వసూళ్లు , ఇతర సేవలు మరింత పారదర్శకంగా సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేష్ బట్టిని శాఖలోని ఉన్నతాధికారులతో ప్రాథమికంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో పన్ను వసూళ్ల లక్ష్యాలు, పెండింగ్లో ఉన్న కీలక అంశాలు , శాఖాపరమైన ప్రాధాన్యతలపై ఆయన దృష్టి సారించారు. నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం.








