Mahaa Daily Exclusive

  మంత్రి పొన్నం హెలికాప్టర్‌లో బీజేపీ ఎమ్మెల్యే హల్‌చల్: వారించినా వినకుండా గగన విహారం చేసిన పాయల్ శంకర్

Share

చాపర్‌ ఎక్కుతా.. ప్లీజ్

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వింత సోకు

* మంత్రి పొన్నంకు ఊహించని అనుభవం!

* మంత్రి వద్దన్నా వినకుండా హెలికాప్టర్ ఎక్కిన బీజేపీ ఎమ్మెల్యే

* ఆదిలాబాద్ ఎయిర్‌డ్రోమ్ వద్ద హైడ్రామా

ఆదిలాబాద్, మహా.

ఆదిలాబాద్ జిల్లా పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమవుతున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్‌ ను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనూహ్యంగా ఎక్కడం మంత్రిని షాక్ కు గురిచేసింది. సాధారణంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వాతావరణం ఉండే తరుణంలో, ఇద్దరు భిన్న ధృవాల నేతలు కలిసి ఒకే హెలికాప్టర్‌లో గగన విహారం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదిలాబాద్ పర్యటన ముగించుకుని ఎయిర్‌డ్రోమ్ వద్దకు చేరుకోగా, అక్కడకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా వచ్చారు. మంత్రి తన హెలికాప్టర్ ఎక్కుతుండగా, ఎమ్మెల్యే కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాజకీయ సమీకరణాల దృష్ట్యా మంత్రి పొన్నం ఆయనను వారించినప్పటికీ పాయల్ శంకర్ వినలేదు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్ వివాదంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, భూములను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. పొన్నం జిల్లా మంత్రి కాదు.. ఆ శాఖతో కూడా సంబ్ధం లేదు. కానీ పాయల్ శంకర్ ఆదిలాబాద్ టౌన్ లో గగనవిహారం చేయాలన్న కోరికతో మంత్రిపై ఒత్తిడిచేయడంతో చేసేది లేక మంత్రి ఆయనను తనతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధికారుల బృందాలను పంపిస్తామని ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వింత అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

**కాంగ్రెస్ నాయకుల గుర్రు.. రాజకీయ దుమారం**
ప్రభుత్వ అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి హెలికాప్టర్‌లోకి ప్రతిపక్ష ఎమ్మెల్యే బలవంతంగా ఎక్కి ప్రయాణించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి బీజేపీ ఎమ్మెల్యే హైడ్రామా సృష్టించారని స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనులు చేపడుతుంటే, క్రెడిట్ కోసం బీజేపీ నేతలు ఇలాంటి ‘వింత’ చేష్టలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాయల్ శంకర్ తీరుతో బిజెపి శ్రేణులు కూడా విస్తుపోతున్నాయి.

Latest