గ్లోబల్ ఆయిల్ సంక్షోభంపై మోదీ-మెక్రాన్ మంత్రాంగం!
* హర్మూజ్ జలసంధిలో ‘హై అలర్ట్’.
* నౌకాయాన స్వేచ్ఛకు భారత్-ఫ్రాన్స్ పట్టు.
* పారిస్‌లో 40 దేశాలతో భారీ సదస్సు.
* చమురు సంక్షోభంపై భారత్-ఫ్రాన్స్ చారిత్రక అడుగు.
ఢిల్లీ, మహా.
నిప్పుల కొలిమిలా మారిన పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రపంచ దిగ్గజ దేశాలు రంగంలోకి దిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య సాగుతున్న దాడులు, ప్రతిదాడులతో అంతర్జాతీయ సమాజం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, సుస్థిరతను నెలకొల్పేందుకు ఇరు దేశాలు తమ వంతు సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముక వంటి ‘హర్మూజ్ జలసంధి’లో నౌకాయాన స్వేచ్ఛను తక్షణమే పునరుద్ధరించాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తన ప్రియ మిత్రుడు మెక్రాన్‌తో జరిపిన చర్చల వివరాలను వెల్లడించారు.
*హర్మూజ్ సెగలు.. చమురు ధరల మంట*
ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమాసియా ఘర్షణలు నెలన్నర రోజులుగా కొనసాగుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య సాగుతున్న ఈ పోరు ప్రభావం హర్మూజ్ జలసంధిపై తీవ్రంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 శాతం చమురు మరియు ఎల్ఎన్జీ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధ వాతావరణం వల్ల నౌకాయానంపై ఆంక్షలు విధించడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ, నౌకాయానానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని స్పష్టం చేశారు. యుద్ధం పరిష్కారం కాదని, చర్చలు , దౌత్యమే ఏకైక మార్గమని భారత్ మొదటి నుంచి నొక్కి చెబుతోంది.
* పారిస్‌లో భారీ వ్యూహం.. 40 దేశాలతో యుద్ధానికి చెక్*
ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఫ్రాన్స్ మరియు బ్రిటన్ సంయుక్తంగా ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశాయి. హర్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడేందుకు ప్రపంచంలోని సుమారు 40 కీలక దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ వారం చివరలో పారిస్ వేదికగా ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నారు. ఈ శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో ‘బహుపాక్షిక రక్షణాత్మక కార్యక్రమం’పై చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ఈ అంశంపై చర్చించి ఉండటం గమనార్హం. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప గ్లోబల్ మార్కెట్లు కుదుటపడవని భారత్ భావిస్తోంది.
*మిత్రుల మంత్రాంగం.. శాంతికి దిక్సూచి*
మోదీ మరియు మెక్రాన్ మధ్య గత మార్చిలో జరిగిన చర్చల కొనసాగింపుగానే తాజా ఫోన్ కాల్ సాగింది. ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఘర్షణల వల్ల అమాయక ప్రజలు బలికావడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా, ప్రపంచ శాంతిని కాపాడే శక్తిగా ఎదిగిందని ఈ సంభాషణ నిరూపిస్తోంది. పారిస్ సదస్సు తర్వాత పశ్చిమాసియా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.







