Mahaa Daily Exclusive

  ఏపీలో పంచాయతీ వార్ సైరన్: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

Share

ఏపీలో పంచాయతీ వార్ సైరన్.
* పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!
* 13,259 పంచాయతీల జాబితా సిద్ధం.
* ఓటర్ల జాబితా విడుదల.
* అభ్యర్థుల్లో మొదలైన ఉత్కంఠ.
* గ్రామాల్లో మొదలైన పొలిటికల్ హీట్.

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఎన్నికల రణభేరి మోగనుంది. గ్రామ పంచాయతీల గడువు ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగ అడుగులు వేస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 13,259 పంచాయతీలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 13,348 పంచాయతీలు ఉండగా, కేవలం 89 పంచాయతీలు మినహా మిగిలిన అన్ని చోట్లా ఓటర్ల వివరాలను బహిర్గతం చేశారు. ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాష్ట్రవ్యాప్తంగా పురుషుల కంటే మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లలో మహిళల సంఖ్య 1.46 కోట్లు దాటడం గమనార్హం. ఇది రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ‘నారీ శక్తి’ కీలకం కాబోతోందని స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ వంద శాతం పూర్తయింది. మిగిలిన 11 జిల్లాల్లో కేవలం 89 పంచాయతీలకు సంబంధించి కొన్ని సాంకేతిక మరియు భౌగోళిక కారణాల వల్ల జాబితా పెండింగ్‌లో ఉంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాలు, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకల్లా పెండింగ్‌లో ఉన్న పంచాయతీల వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారుపై ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
మరోవైపు, యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల పంచాయతీ రాజ్ చట్టంలో కీలక సవరణలు తీసుకువచ్చింది. ఏటా జనవరి 1నే కాకుండా, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తేదీలను కూడా అర్హత తేదీలుగా నిర్ణయించడంతో 18 ఏళ్లు నిండిన వేలాది మంది యువతకు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం దక్కనుంది. ఓటర్ల సంఖ్యలో పురుషులు 1,42,26,677 ఉండగా, మహిళలు 1,46,73,412 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 1,313గా నమోదైంది. పల్లె పోరులో మహిళా ఓటర్లే గెలుపోటములను శాసించనుండటంతో, వారిని ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి.