Mahaa Daily Exclusive

  బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా?: తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

Share

  • బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా
  • తేజస్వీ మాటల్లో అంతరార్థం ఉంది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, మహా : బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తేజస్వీ సూర్య మాట్ల వెనుక అంతరార్ధం వేరని వివరణ ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని రామచందర్ రావు ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఆందోళనలకు కారణం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్, పాక్ దేశాల విభజనతో పోల్చుతూ తెలంగాణను తీవ్రంగా అవమానించారంటూ, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.. తాజాగా తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఎంపీ తేజస్వీ మాట్లాడిన మాటల్లో ఉన్న అంతరార్థం వేరని, బీఆర్ఎస్ నేతలు వాటిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తేజస్వీ సూర్య మాటలను భూతద్దంలో పెట్టి చూడొద్దని రామచందర్ రావు హితవు పలికారు. తెలంగాణను పాకిస్తాన్‌తో తేజస్వీ సూర్య పోల్చలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జరిగిన పోరాటం సందర్భంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)లో బీజేపీ కూడా భాగంగా ఉందని రామచందర్ రావు గుర్తు చేశారు. బీజేపీ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో బీఆర్ఎస్ ఇద్దరు సభ్యులు లేరని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడంతో చాలా మంది తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని ప్రశ్నించారు. వాజ్‌పేయి చాలా సాఫీగా ఒక్క రక్తం చుక్క కూడా పడకుండా 2001లో 3 రాష్ట్రాలను ఇచ్చారని రామచందర్ రావు గుర్తు చేశారు.