- 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి…
- 5 శాతం నూకతో బాయిల్డ్ రైస్ సరఫరాకు సిద్ధం
- పాత బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి
- పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ వినతి
ఢిల్లీ, మహా : యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గానూ పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని… ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.








