- సచివాలయ ఉద్యోగులకు శాపం
- ఆర్టీసీ కార్మికులకు ద్రోహం
- సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం కేవలం పబ్లిసిటీ వ్యామోహం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధ్వజం
హైదరాబాద్, మహా : తెలంగాణలో పాలన గాలిలో దీపంలా మారిందని, కాంగ్రెస్ అరాచకంలో సామాన్య ప్రజలు, కార్మికులు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయని, ప్రజా సమస్యలు పరిష్కరించే నిలయం సెక్రటేరియట్ లోనే ఉద్యోగులు ‘భోజన విరామ నిరసన’ చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతోందన్నారు. పీఆర్సీ అమలు లేదు, పెండింగ్ డీఏలు రావు, హెల్త్ కార్డులు పనిచేయవు, చివరకు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టిన ఓపీఎస్ హామీని కూడా గాలికొదిలేశారన్నారు. సచివాలయ ఉద్యోగులకే దిక్కులేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లెక్కిన తెలంగాణ సచివాలయ ఉద్యోగుల ‘భోజన విరామ నిరసన’కు, అలాగే ఈ నెల 22 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందన్నారు. ఉద్యోగ, కార్మిక వర్గాల హక్కుల సాధన కోసం బీజేపీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. అటు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం 22 నుంచి సమ్మెకు వెళ్తుండటంతో ప్రభుత్వం వణికిపోతోందన్నారు. అందుకే కొన్ని జేఏసీలో లేని సంఘాలతో లాలూచీ పడి, కార్మికుల ఐక్యతను దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. గతంలో కూడా ఇలాగే కార్మికులను మోసం చేశారని, పీఆర్సీ, ఏరియర్స్ అడిగితే కుట్రలు చేస్తారా? మీ అసమర్థతకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను బలి చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రమంతా సమ్మెల బాట పట్టినా, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని, ఆయనకు కేవలం తన ‘వ్యక్తిగత ఇమేజ్’ బిల్డింగ్ మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల మీద లేదని దుమ్మెత్తి పోశారు. జాతీయ నాయకుడిగా ఎదగాలనే ఆరాటంతో, దేశాన్ని విడగొట్టేలా ‘నార్త్ వర్సెస్ సౌత్’ అంటూ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక చట్టం తీసుకొస్తుంటే.. దాన్ని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని వితండవాదాన్ని తెరపైకి తెస్తున్నారని, డీలిమిటేషన్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ, మహిళల హక్కులకు గండికొట్టాలని చూడటం దుర్మార్గమన్నారు. ఒకవైపు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీ పర్యటనలు, రాజకీయ వక్రీకరణలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.








