Mahaa Daily Exclusive

  బూమ్.. బూమ్.. బుమ్రాకు ఏమైంది?

Share

* ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్టూ లేని వైనం.
*యార్కర్ కింగ్ అమ్ములపొదిలో అస్త్రాలు తగ్గాయా?
*వేగం తగ్గింది.. స్లో బంతులు పెరిగాయి.

ముంబై, మహా.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత భయంకరమైన బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి బ్యాటర్ల స్టంప్‌లను ఎగురగొట్టడంలో సిద్ధహస్తుడైన ఈ ‘యార్కర్ కింగ్’, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడిన వరుస ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పరుగులివ్వడానికి పిసినారిగా ఉంటూనే కీలక వికెట్లు పడగొట్టే బుమ్రా, ఈసారి మాత్రం అటు వికెట్లు తీయలేక, ఇటు పరుగులు అదుపు చేయలేక సతమతమవుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మొదలైన ఈ వికెట్ల కరువు.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీదుగా నిన్నటి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వరకు కొనసాగడం ముంబై ఇండియన్స్ జట్టును పీడకలలా వేధిస్తోంది.
బుమ్రా వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్‌లో బుమ్రా బౌలింగ్ వేగం గణనీయంగా తగ్గిందని, సగటున 130 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసురుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బుమ్రా తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రమైన వేగాన్ని పక్కనపెట్టి, దాదాపు 44 శాతం బంతులను ‘స్లోయర్ బాల్స్’ రూపంలోనే వేస్తున్నారని, దీనివల్ల బ్యాటర్లు సులువుగా పసిగట్టి పరుగులు సాధిస్తున్నారని పఠాన్ పేర్కొన్నారు. వేగాన్ని పెంచి స్లోయర్ బంతుల శాతాన్ని తగ్గిస్తే తప్ప బుమ్రా మళ్లీ వికెట్ల వేట మొదలుపెట్టలేరని ఆయన సూచించారు. మరోవైపు ముంబై కోచ్ మహేళ జయవర్ధనే స్పందిస్తూ.. టీ20 ప్రపంచకప్ సమయంలో తగిలిన చిన్నపాటి గాయం (నిగ్గల్) వల్ల బుమ్రా వేగం కొంత తగ్గి ఉండొచ్చని, అయితే ప్రస్తుతం అతను కోలుకున్నాడని వెల్లడించారు.
జట్టులోని ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా బుమ్రాపై అదనపు ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇస్తుండటంతో, బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో రిస్క్ తీసుకోకుండా కేవలం వికెట్ కాపాడుకుంటూ ఆడుతున్నారు. దీంతో వికెట్లు పడే అవకాశం తగ్గిపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో బుమ్రా వరుసగా 0/35, 0/21, 0/32, 0/35 , 0/41 గణాంకాలను నమోదు చేశారు. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటానికి ప్రధాన కారణం వారి స్ట్రైక్ బౌలర్ ఫామ్ కోల్పోవడమేనని స్పష్టమవుతోంది. బుమ్రా త్వరగా పుంజుకుని తన పాత వైభవాన్ని చాటుకోకపోతే ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.