Mahaa Daily Exclusive

  సినీ పరిశ్రమ నుంచి సింగర్ మంగ్లీని బహిష్కరించాలి….

Share

*మైక్రో ఫైనాన్స్ మోసాల ఆరోపణలపై పంజాగుట్టలో కేసు నమోదు.
*బాధితులకు న్యాయం జరిగే వరకు నిషేధం విధించాలన్న తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.
*’మా’ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ఫిర్యాదు*
హైదరాబాద్, మహా.
ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. తనదైన జానపద, సినీ గీతాలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమెపై ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో నిరుపేదల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే వార్తల నేపథ్యంలో, సింగర్ మంగ్లీని తక్షణమే సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు అధికారికంగా ఒక ఫిర్యాదును అందజేశారు.
గత కొంతకాలంగా మంగ్లీ పేరు మీద మైక్రో ఫైనాన్స్ దందా నడుస్తోందని, అమాయకులైన నిరుపేదలను నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో మోసపోయిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో కొనసాగనివ్వడం నైతికంగా సరికాదని పలువురు సినీ కార్మికులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ స్పందిస్తూ.. మంగ్లీ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. సినిమా అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయనే ధీమాతో సామాన్య ప్రజలను మోసం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు, ముఖ్యంగా అందులో ఉన్న నిరుపేదలకు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఆమెను టాలీవుడ్ నుంచి బహిష్కరించాలని ‘మా’ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను ఆయన కోరారు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్న కళాకారులు ఇలాంటి మోసాలకు పాల్పడటం విచారకరమని ఆయన తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.