Mahaa Daily Exclusive

  అన్నదాతలకు తీపికబురు…

Share

* రేపే ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు.
* కాటారం సభ వేదికగా నిధుల విడుదల.
*రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు లబ్ధి.
*రూ.5,653 కోట్ల పెట్టుబడి సాయం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. అన్నదాతలు సాగు పెట్టుబడి కోసం అప్పులపాలు కాకూడదనే ఉన్నత ఉద్దేశంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాటారం సభ వేదిక నుంచే ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను బదిలీ చేయనున్నారు. వానాకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్న తరుణంలో, సకాలంలో అందుతున్న ఈ ఆర్థిక సాయం వ్యవసాయ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపనుంది.
రెండో విడత రైతు భరోసా పంపిణీ ద్వారా మెజారిటీ రైతులకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 45,11,947 మంది అర్హులైన అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం ఏకంగా రూ. 5,653 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులను సైతం కవర్ చేస్తూ, ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుకు మరియు దుక్కి దున్నే వ్యవసాయ పనులకు ఈ నిధులు ఎంతగానో వెసులుబాటు కల్పిస్తాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతుండటంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన భారం తప్పుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే గత నెల మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం విధితమే. ఆ రోజున ఒక ఎకరం లోపు ఉన్న రైతులను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసింది. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను క్రమపద్ధతిలో నెరవేరుస్తున్నట్లు సర్కారు స్పష్టం చేస్తోంది. కేవలం ఈ రెండు విడతలతోనే ఆగిపోకుండా, సాంకేతిక కారణాల వల్ల ఇంకా సాయం అందని మిగిలిన అర్హులైన రైతులందరికీ మూడో విడతలో పెట్టుబడి సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందని, అందుకోసం నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు ప్రకటించాయి. సర్కారు తీసుకుంటున్న ఈ వేగవంతమైన చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.