హైదరాబాద్, ఏప్రిల్ 18: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శనివారం డాక్టర్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా “వెల్ఫేర్ వీక్” నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ రోజువారీ షెడ్యూల్ను వివరించారు:
1. ఏప్రిల్ 20: అన్ని వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటశాలలు, శానిటేషన్ పై సమగ్ర శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి. అధికారులు విద్యాసంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలి.
2. ఏప్రిల్ 21: వెల్ఫేర్ విద్యార్థుల కోసం క్విజ్, డిబెట్, చిత్రలేఖనం వంటి పోటీలతో టాలెంట్ ఫెస్ట్ నిర్వహించి సృజనాత్మకతను, మేధస్సును ప్రోత్సహించాలి.
3. ఏప్రిల్ 22: హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులపై దృష్టి పెట్టి అంచనాలు సిద్ధం చేసి, తగిన అనుమతులు తీసుకుని, వేసవి సెలవుల్లో పనులను పూర్తి చేయాలి.
4. ఏప్రిల్ 23: తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు (PTMs) నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించాలి. విద్యా ప్రతిభను ప్రోత్సహించాలి.
5. ఏప్రిల్ 24: యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రభుత్వ పథకాలను వివరించాలి.
6. ఏప్రిల్ 25: విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ లిటరసీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలతో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి.
7. ఏప్రిల్ 26: రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో “బడి బాట” కార్యక్రమం నిర్వహించాలి.
జిల్లా కలెక్టర్లు ప్రతి కార్యక్రమం అమలును క్షుణ్ణంగా పర్యవేక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఘోష్ సూచించారు.
ప్రజాప్రతినిధులను అన్ని కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయాలని, తద్వారా విస్తృత ప్రచారం, పారదర్శకత పెరుగుతుందని ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, CIPR సిహెచ్. ప్రియాంక, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు।







