*రూ. 2.5 లక్షల లంచం కేసులో ముడావత్ దేవులా అరెస్టు.
*డ్రోన్ల దిగుమతి అనుమతుల కోసం అక్రమాలు.
*కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా అరెస్ట్.
* రూ. 37 లక్షల నగదు, బంగారం, వెండి నాణేలు స్వాధీనం.
ఢిల్లీ, మహా.
పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)లో భారీ అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో డీజీసీఏ ఎయిర్‌వర్తీనెస్ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముడావత్ దేవులాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసింది. ఆయనతో పాటు లంచం ఇస్తున్న ప్రముఖ కార్పొరేట్, ఏరోస్పేస్ కంపెనీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాథుర్‌ను కూడా సీబీఐ అధికారులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
**లంచం ఎందుకంటే..**
డ్రోన్ల దిగుమతికి సంబంధించి ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన దరఖాస్తులు, ఇతర అనుమతుల ఫైళ్లు డీజీసీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేసి, అనుమతులు జారీ చేసేందుకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముడావత్ దేవులా సదరు ప్రైవేట్ సంస్థ ప్రతినిధుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 18 కేసు నమోదు చేసిన సీబీఐ.. వ్యూహాత్మకంగా వల పన్ని ఢిల్లీలోని డీజీసీఏ హెడ్ క్వార్టర్స్‌లోనే దేవులాను, భరత్ మాథుర్‌ను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ. 2.5 లక్షల లంచం మొత్తాన్ని అక్కడికక్కడే సీజ్ చేశారు.
**దాడుల్లో భారీగా అక్రమ సంపద గుర్తింపు..**
ఈ అరెస్టుల అనంతరం, అప్రమత్తమైన సీబీఐ అధికారులు నిందితుల ఇళ్లు, ఇతర సంబంధిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఢిల్లీలోని మొత్తం నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో జరిపిన ఈ దాడుల్లో భారీగా అక్రమ సంపద బయటపడింది. ఏకంగా రూ. 37 లక్షల నగదుతో పాటు భారీగా బంగారం, వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఉన్న పలు డిజిటల్ పరికరాలను కూడా సీజ్ చేశారు. డ్రోన్ల దిగుమతికి సంబంధించిన ఈ కుంభకోణంలో ఇంకెవరి హస్తమైనా ఉందా అనే కోణంలో సీబీఐ తదుపరి దర్యాప్తును ముమ్మరం చేసింది.







