*వ్యాపారుల గుట్టురట్టు చేసేందుకు మార్కెట్లలో ‘స్ట్రిప్ పేపర్ టెస్ట్’ అస్త్రం.
*రసాయనాలకు బదులుగా ప్రభుత్వ ‘రైపనింగ్ ఛాంబర్స్’ వాడుకోవాలని సూచన.
హైదరాబాద్, మహా.
వేసవి కాలం రాగానే మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లతో పాటు అరటి, బొప్పాయిల ముసుగులో కృత్రిమంగా పండించిన విషాన్ని ప్రజలకు విక్రయిస్తున్న వ్యాపారుల ఆట కట్టించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ‘కాల్షియం కార్బైడ్’ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని ఉపయోగించి పండ్లను ముగ్గబెట్టడాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పూర్తిగా నిషేధించింది. నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిన లాభాలు ఆర్జించేందుకు కార్బైడ్ వాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని పండ్ల మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడే వ్యాపారులను పట్టుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులకు ‘స్ట్రిప్ పేపర్ టెస్ట్’ అనే ఒక సులభమైన సాంకేతికతను సూచించింది. ఈ పరీక్ష ద్వారా పండ్లలో ప్రమాదకరమైన ఎసిటిలీన్ గ్యాస్ ఉందో లేదో ఇట్టే పసిగట్టవచ్చు. తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానం ఉన్న పండ్లను గాలి చొరబడని ఒక కంటైనర్‌లో ఉంచి, అందులో ఒక తడి స్ట్రిప్ పేపర్‌ను ఉంచుతారు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత ఆ పేపర్ రంగు మారితే, ఆ పండ్లను కృత్రిమంగా ముగ్గబెట్టేందుకు కచ్చితంగా కాల్షియం కార్బైడ్ వాడినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారిస్తారు. దొరికిన వెంటనే సదరు డీలర్లు, వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు.
కార్బైడ్ లాంటి కృత్రిమ రసాయనాలు వాడి ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యంతో చెలగాటమాడొద్దని వ్యాపారులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పండ్లను అత్యంత సురక్షితంగా, శాస్త్రీయ పద్ధతిలో ముగ్గబెట్టేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రధాన మార్కెట్లలో ప్రభుత్వం ఇప్పటికే ఆధునిక సాంకేతికతతో కూడిన ‘రైపనింగ్ ఛాంబర్స్’ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు, రైతులు ఈ సురక్షితమైన ప్రభుత్వ సదుపాయాలను మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రసాయనాలు వాడితే జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరోవైపు పండ్ల కొనుగోలు సమయంలో వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండి, సహజంగా పండిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు కోరుతున్నారు.







