Mahaa Daily Exclusive

  ప్రేమ పేరిట వల…..

Share

* బ్లాక్ మెయిలింగ్‌తో నిలువు దోపిడీ.
* 20 మందికి పైగా మైనర్లను మోసగించిన కీచకుడి అరెస్ట్.
*సోషల్ మీడియాలో పరిచయం.. రహస్యంగా ఫొటోలు తీసి బెదిరింపులు.
* కోటీశ్వరుల బిడ్డలే లక్ష్యంగా యువకుడి ఉచ్చు.

హైదరాబాద్, మహా
సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని, అబద్ధపు ప్రేమను ఎరగా వేసి సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికల జీవితాలతో చెలగాటమాడుతున్న ఒక కరుడుగట్టిన మోసగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. అమాయకపు బాలికలను లోబరుచుకుని, వారి ఏకాంత చిత్రాలను రహస్యంగా బంధించి, ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండేళ్ల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవై మందికి పైగా బాలికలు ఇతడి ఉచ్చులో పడి సర్వస్వం కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23) ప్రస్తుతం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటూ ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.
ఆజాద్ నేర శైలి అత్యంత పక్కాగా, పథకం ప్రకారం సాగేది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని బడా బాబులు, సంపన్నుల ఇళ్ల వద్ద పనిచేసే వాచ్‌మెన్లు, తోటమాలి వంటి సిబ్బందితో ముందుగా మాటకలిపి పరిచయం పెంచుకునేవాడు. వారి ద్వారా ఆయా ఇళ్లల్లో ఉండే యువతులు, బాలికల వివరాలను, వారి జీవనశైలిని ఆరా తీసేవాడు. మరోవైపు ఇన్స్‌టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్స్ వెతికి పట్టుకునేవాడు. తాను కూడా కోటీశ్వరుడినే అని నమ్మించేందుకు, ఖరీదైన కార్లు, పబ్‌లలో తాను దిగిన ఫొటోలను వారికి పంపుతూ, మాయమాటలతో చాటింగ్ చేసి దగ్గరయ్యేవాడు. అతడి ఆడంబరాలు చూసి నిజమైన ప్రేమే అని నమ్మి వచ్చిన యువతులను వ్యూహాత్మకంగా లోబరుచుకునేవాడు. వారితో గడిపిన క్షణాలను అత్యంత రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి తన వద్ద పదిలపరుచుకునేవాడు.
ఒకసారి ఆ దృశ్యాలు అతడి చేతికి చిక్కాక తన అసలు స్వరూపం బయటపెట్టేవాడు. ఆ ఏకాంత ఫొటోలు, వీడియోలను బాధిత బాలికలకు చూపించి, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని, తల్లిదండ్రులకు చూపిస్తానని తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగేవాడు. పరువు పోతుందన్న భయంతో, తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న ఆందోళనతో కంగుతిన్న బాలికలు.. గత్యంతరం లేక తమ సొంత ఇళ్లల్లోనే దొంగతనాలకు ఒడిగట్టేవారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించి తీసుకువచ్చి ఆజాద్ చేతిలో పెట్టేవారు. ఆ భయంతోనే ఎంతో మంది యువతులు అతడి అడిగినంత సమర్పించుకున్నారు.
తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల మైనర్ బాలిక వ్యవహారంతో ఆజాద్ ఆగడాలకు బ్రేక్ పడింది. అర్జున్ అనే పేరుతో ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న ఆజాద్, రాత్రి వేళల్లో రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లి కలిసేవాడు. దీనిని పసిగట్టిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గతంలో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆజాద్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. సదరు బాలిక వాళ్ల ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి మొబైల్ ఫోన్ల ద్వారా ఆమెతో తిరిగి సంప్రదింపులు జరిపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆజాద్ ఆమెను కలిసి ఏకాంతంగా గడిపాడు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ భార్య సరస్వతి, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానంటూ ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. మరోవైపు ఆజాద్ సైతం తనదైన శైలిలో బెదిరింపులకు దిగాడు. ఇద్దరి బెదిరింపులు తాళలేక తీవ్ర భయాందోళనలకు గురైన ఆ బాలిక.. ఇంట్లో దాచిపెట్టిన ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నగదును దొంగిలించింది. అందులో ఆజాద్‌కు పదమూడు లక్షలు, సరస్వతికి పది లక్షల రూపాయలు ముట్టజెప్పింది. ఇంట్లో భారీగా నగదు మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో వెంటనే కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఆజాద్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతిని కూడా ఇతడు ఇదే తరహాలో వంచించినట్లు తేలింది. గుంటూరులో కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆ యువతిని మాయమాటలు చెప్పి హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత గుంటూరు, హైదరాబాద్‌లలో పలు పబ్‌లు, హోటళ్లకు తిప్పి, ఆ ఫొటోలు, వీడియోలు చూపించి ఆమె మెడలోని బంగారు గొలుసును సైతం కాజేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ ఘరానా మోసగాడి అరెస్ట్‌తో ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పాడుపని బట్టబయలైంది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.