Mahaa Daily Exclusive

  భారత్, దక్షిణ కొరియా మైత్రి…

Share

*’ప్రపంచానికి శాంతి సందేశం.
*ప్రజాస్వామ్య విలువలే మన బంధానికి పునాది.
* ప్రధాని నరేంద్ర మోదీ.
*దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ముగిసిన కీలక ద్వైపాక్షిక చర్చలు.
*2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం.
ఢిల్లీ, మహా.
భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రజాస్వామ్య విలువలే బలమైన పునాది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన అనేవి రెండు దేశాల డీఎన్‌ఏలోనే అంతర్భాగంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు సెమీ కండక్టర్ల తయారీ, రక్షణ రంగంలో సహకారం, పర్యావరణ హితమైన హరిత ఇంధనం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) వంటి అత్యంత కీలకమైన సామాజిక, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న మైత్రీబంధం యావత్ ప్రపంచానికి శాంతి, స్థిరత్వ సందేశాన్ని ఇస్తుందని కొనియాడారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సమగ్ర వృద్ధి సాధన కోసం రెండు దేశాలు ఒకే విధమైన బలమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య బంధం మరింత క్రియాశీలకంగా, పటిష్టంగా మారిందని ప్రధాని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలోనూ వస్తున్న సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, రెండు దేశాలు అభివృద్ధి పథంలో భుజం భుజం కలిపి ముందుకు సాగుతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
**వాణిజ్య, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం**
ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా వాణిజ్య, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే దిశగా ఇరు దేశాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వాణిజ్య లక్ష్యాలను వివరిస్తూ.. ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరుకుందని, దీనిని 2030వ సంవత్సరం నాటికి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా ఈరోజు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన లావాదేవీలను మరింత సులభతరం చేసి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘భారత్‌-కొరియా ఫైనాన్షియల్ ఫోరమ్‌’ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. వ్యాపార రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక పారిశ్రామిక సహకార కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దీనితో పాటుగా కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సరఫరా గొలుసుల్లో సహకారాన్ని పెంపొందించుకునే ఉద్దేశ్యంతో ఆర్థిక భద్రతా చర్చలకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొరియన్ కంపెనీలు, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారతదేశంలోకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవేశించి తమ వ్యాపారాలను సులభతరం చేసుకోవడానికి ప్రత్యేకంగా ‘కొరియన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌’లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాబోయే ఏడాది కాలంలో భారత్‌, కొరియా వాణిజ్య ఒప్పందాన్ని మరింత ఉన్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేసి, ఇరు దేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.