Mahaa Daily Exclusive

  గల్ఫ్‌లో హైటెన్షన్….

Share

* భారతీయ చమురు నౌకలకు నేవీ హైఅలర్ట్.
* లారక్ దీవికి దూరంగా ఉండాలని నౌకాదళం స్పష్టమైన ఆదేశాలు.
* రంగంలోకి ఏడు భారీ యుద్ధ నౌకలు.
ఢిల్లీ, మహా.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు భగ్గుమంటున్న వేళ భారత నౌకాదళం అత్యంత అప్రమత్తమైంది. ఆ మార్గంలో చమురు రవాణా చేసే భారతీయ వాణిజ్య నౌకలకు భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్ దళాల ఆధీనంలో ఉండే లారక్ ద్వీపం పరిసర ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని, నౌకాదళం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించాలని అందులో తేల్చిచెప్పింది. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బలగాలు రెండు భారతీయ నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన నేపథ్యంలో, అప్రమత్తమైన భారత రక్షణ శాఖ హర్మూజ్ జలసంధి వద్ద భద్రతను మునుపెన్నడూ లేనివిధంగా కట్టుదిట్టం చేసింది. జలసంధిని దాటేందుకు వేచి ఉన్న ప్రతి భారతీయ నౌక భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని నేవీ స్పష్టం చేసింది.
**ఇరాన్ రాయబారికి తీవ్ర నిరసన..**
ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ నుంచి పదకొండు భారతీయ నౌకలు అత్యంత సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ‘దేశ్ గరిమ’ అనే చమురు ట్యాంకర్ చివరగా ఈ జలసంధిని దాటింది. అయితే అదే రోజున ‘జగ్ అర్నవ్’, ‘సన్మార్ హెరాల్డ్’ అనే మరో రెండు భారతీయ నౌకలు జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా, ఇరాన్ దళాలు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు అవి వెనక్కి మళ్లాల్సి వచ్చింది. భారత నౌకలపై జరిగిన ఈ దాడిని కేంద్ర విదేశాంగ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. తక్షణమే భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసి, ఈ ఘటనపై తమ తీవ్ర నిరసనను తెలియజేసింది. కాగా, కాల్పుల నడుమ హర్మూజ్ జలసంధిని దాటిన ‘దేశ్ గరిమ’ నౌకకు అరేబియా సముద్రంలో భారత నౌకాదళం పటిష్టమైన ఎస్కార్ట్ (రక్షణ) కల్పిస్తూ తీసుకువస్తోంది. ఇది ఏప్రిల్ ఇరవై రెండు నాటికి సురక్షితంగా ముంబయి తీరానికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
**లారక్ దీవి చుట్టూ పొంచి ఉన్న ముప్పు..**
హర్మూజ్ జలసంధిలోని అత్యంత ఇరుకైన ప్రాంతంలో కొలువై ఉన్న లారక్ ద్వీపం ప్రస్తుతం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలకు ప్రధాన కేంద్రమైన ఈ ప్రాంతంలో ఆ దేశం అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. భారీ బంకర్లు, అత్యాధునిక రాడార్ వ్యవస్థల ద్వారా హర్మూజ్ గుండా వెళ్లే ప్రతి నౌక రాకపోకలను ఇరాన్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు ఉండే హర్మూజ్ జలసంధిలో హర్మూజ్ ద్వీపం ఉండగా, దానికి దక్షిణంగా ఈ లారక్ ద్వీపం ఉంటుంది. ప్రపంచ చమురులో సుమారు ఇరవై శాతం రవాణా ఈ కీలక మార్గం గుండానే జరుగుతుంది. అయితే, ఈ ప్రాంతంలో ఇరాన్ అనేక సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని, చిన్నపాటి వేగవంతమైన పడవల ద్వారా ఎంతటి భారీ నౌకలపైనైనా క్షణాల్లో దాడులు చేయగల సామర్థ్యం వారికి ఉందని నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
**సముద్ర గర్భంలో మైన్స్.. పటిష్ట కాపలాలో నేవీ..**
గతంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న దక్షిణ మార్గాన్ని వాణిజ్య నౌకలు సురక్షితంగా భావించేవి. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ మార్గంలో ఇరాన్ దళాలు సముద్ర గర్భంలో నౌకలను పేల్చేసే భారీ బాంబులను (మైన్స్) అమర్చిందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ మార్గాన్ని అత్యంత ప్రమాదకరమైన జలమార్గంగా ప్రకటించారు. ప్రస్తుతం హర్మూజ్, లారక్ ద్వీపాల మధ్య ఉన్న సన్నటి మార్గాన్ని మాత్రమే సురక్షిత కారిడార్‌గా పరిగణిస్తున్నారు. అందుకే లారక్ ద్వీపం సమీపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని భారత నౌకలకు ఇండియన్ నేవీ కఠిన సూచనలు చేసింది. ప్రస్తుతం పద్నాలుగు భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోని జలసంధిని దాటేందుకు నిరీక్షిస్తున్నాయి. ఈ నౌకల భద్రత కోసం భారత నౌకాదళం ఏకంగా ఏడు భారీ యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్ పరిసరాల్లో మోహరించింది. మరోవైపు, దేశీయ చమురు అవసరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రష్యా నుంచి చమురు దిగుమతులను సురక్షితంగా కొనసాగించేందుకు వీలుగా.. పదకొండు రష్యా బీమా సంస్థలకు ప్రభుత్వం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.