Mahaa Daily Exclusive

  విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు…

Share

* జూన్ 15న కోర్టుకు రాక తప్పదన్న న్యాయస్థానం.
*చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ వాయిదా.
* వీడియో కాన్ఫరెన్స్‌కు నో చెప్పిన జడ్జి.

చెన్నై, మహా.

కోలీవుడ్ అగ్రకథానాయకుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు న్యాయస్థానం మెట్లు ఎక్కి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇరువురు తప్పనిసరిగా జూన్ 15న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.
**వీడియో కాన్ఫరెన్స్‌కు ససేమిరా..**
తొలుత చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో నమోదైన ఈ కేసు, అనంతరం ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు బదిలీ అయిన విషయం విదితమే. ఫిబ్రవరి 26న జరిగిన తొలి విచారణలో న్యాయస్థానం ఇరువురికీ సమన్లు జారీ చేయగా, తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సోమవారం నాటి విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ విముఖత చూపుతూ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. కేవలం వారి తరఫు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ అత్యంత బిజీగా ఉన్నారని, అందువల్ల ఆయనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించాలని ఆయన న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. కానీ, ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన కోర్టు.. తదుపరి విచారణకు వ్యక్తిగత హాజరే తప్పనిసరని తేల్చిచెప్పింది.
**నాలుగేళ్లుగా ఒకే ఇంట్లో.. కానీ దూరంగా!**
తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత గత ఫిబ్రవరి 24న కోర్టును ఆశ్రయించారు. 1999లో ఘనంగా జరిగిన తమ వివాహ బంధంలో ఇద్దరు పిల్లలు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) ఉన్నారని ఆమె తన పిటిషన్‌లో ప్రస్తావించారు. పెళ్లయిన తొలినాళ్లలో అంతా సవ్యంగానే సాగినప్పటికీ, 2021 నుంచి తమ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, దీనివల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గత నాలుగేళ్లుగా ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ, వాస్తవానికి ఒకరికొకరం విడిగానే జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న వివిధ పోస్టులు తనకు, తన పిల్లలకు తీరని అవమానాన్ని మిగుల్చుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తమ వివాహ బంధాన్ని చట్టబద్ధంగా రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలని, లేదా శాశ్వత భరణం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే, ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో, విచారణను ఇన్‌-కెమెరా విధానంలో రహస్యంగా జరపాలని సంగీత కోర్టును అభ్యర్థించారు.
**భరణంపై జోరుగా ఊహాగానాలు..**
విడాకుల వ్యవహారం తెరపైకి రావడంతో, కోలీవుడ్ వర్గాల్లో సెటిల్‌మెంట్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విజయ్ కున్న వందల కోట్ల ఆస్తుల నేపథ్యంలో, సంగీత సుమారు రూ. 250 కోట్ల వరకు భరణం (సెటిల్‌మెంట్) డిమాండ్ చేసినట్లు పలు మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. మరోవైపు, విజయ్ మాత్రం రూ. 35 కోట్ల వరకు భరణం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని, అలాగే పిల్లల బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని స్పష్టం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ భారీ సెటిల్‌మెంట్ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
ఇదిలా ఉండగా, ఇప్పటివరకు సంగీత మాత్రమే విడాకుల పిటిషన్ దాఖలు చేశారని, విజయ్ తరఫున ఎలాంటి కౌంటర్ పిటిషన్ నమోదు కాలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు. రానున్న జూన్ 15వ తేదీన జరిగే విచారణలో విజయ్ తన వాదనలను బలంగా వినిపించే అవకాశం ఉంది. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్న విజయ్‌కు ఈ కేసు విచారణ అత్యంత కీలకంగా మారనుంది. ఇద్దరూ కోర్టు బోనులో నిలబడి తమ వాదనలు వినిపించనున్న నేపథ్యంలో, జూన్ 15 నాటి విచారణ ఈ కేసులో కీలక మలుపు అవుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.