Mahaa Daily Exclusive

  ప్రధాని పర్యటనకు ముందే అపశ్రుతి…

Share

* హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.
*కలకలం రేపుతున్న ఘటన.. భద్రతా లోపమా?
* సాంకేతిక సమస్యా? అనే కోణంలో దర్యాప్తు.

పచ్‌పద్ర (రాజస్థాన్),మహా.

రాజస్థాన్‌లోని పచ్‌పద్రలో ఉన్న ప్రతిష్టాత్మక హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు రూ.79,450 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును మంగళవారం (ఏప్రిల్ 21న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. ప్రధాని పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ అనూహ్య ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
రిఫైనరీలోని ప్రధాన యూనిట్లలో ఒకదానిలో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి భారీ స్థాయికి చేరుకుని, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్‌లోని కార్మికులను అత్యవసర మార్గాల ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు. దీనివల్ల పెను ప్రాణనష్టం తప్పినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. మంటలు పక్కనే ఉన్న ఇతర యూనిట్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ యంత్రసామగ్రి కాలిపోవడం వల్ల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అప్పటికే ఉన్నతాధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బలగాలు అక్కడ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత, నిఘా నీడలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందా, లేక ఏదైనా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలో ఉన్నతాధికారులు అత్యవసర దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణంలో జరిగిన ఈ ఘటన అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన, ప్రారంభోత్సవ షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉంటాయా, లేదా కార్యక్రమం వాయిదా పడుతుందా అనే విషయాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.