* రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌లో భయానక పేలుడు.
* అయ్యపంగిడిలో ఉలిక్కిపడ్డ జనం.
* తీవ్ర వత్తిడితో గ్యాస్ పైప్‌లైన్ పగిలి భారీ ప్రమాదం.
* పెను ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
* రిలయన్స్ ప్లాంట్‌లో పేలుడుపై అధికారుల ముమ్మర దర్యాప్తు.
తూర్పుగోదావరి,మహా.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం అయ్యపంగిడిలో ఉన్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అత్యంత భయానక శబ్దంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో నుంచి భారీ ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ ఊహించని పరిణామంతో ఫ్యాక్టరీలోని కార్మికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణభయంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ఈ బయోగ్యాస్ ప్లాంట్‌లో పశువుల పేడ, ఇతర వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను పైప్లైన్ల ద్వారా స్టోరేజ్ ప్లాంట్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గ్యాస్ సరఫరా అవుతున్న సమయంలో పైప్‌లైన్‌లో ఒక్కసారిగా తీవ్రమైన వత్తిడి (ప్రెజర్) ఏర్పడటంతో, దానికి ఉన్న మూతలు పగిలిపోయి ఈ భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, పేలుడు సంభవించిన పైప్‌లైన్ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని ఫ్యాక్టరీ వర్గాలు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురికాకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో భద్రతా పరంగా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు గతంలో ఫైర్ సేఫ్టీ అధికారులు నిర్ధారించినప్పటికీ, తాజా పేలుడు నేపథ్యంలో మరోసారి సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత, అసలు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సాంకేతిక లోపాలపై లోతైన దర్యాప్తు చేపడతామని అగ్నిమాపక, భద్రతా అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఘటనపై విచారణకు సహకరించి పూర్తి స్థాయి నివేదికను అందించాల్సి ఉంది. ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం భరోసా ఇచ్చింది.








