*డిజిటల్ అరెస్ట్’ల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి.
* వయోవృద్ధురాలి దీనస్థితిని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.
* డిజిటల్ అరెస్టుల కేసుపై మే 12న సుమోటో విచారణ**
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా కలకలం రేపుతూ అమాయకుల ప్రాణాలతో, ఆస్తులతో చెలగాటమాడుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ల వ్యవహారంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నకిలీ బెదిరింపులకు భయపడి మోసపోతుండటం పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. సమాజంలో చదువురాని సామాన్యులే కాకుండా, చట్టాలపై , సాంకేతికతపై కనీస అవగాహన ఉండాల్సిన విద్యావంతులు కూడా ఈ తరహా కొత్త తరహా మోసాలకు సులువుగా బలికావడం అత్యంత బాధాకరమని, ఇది వ్యవస్థల లోపాన్ని అలాగే సైబర్ నేరగాళ్ల పకడ్బందీ వ్యూహాలను సూచిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన తనకు తెలిసిన ఒక హృదయ విదారకమైన ఘటనను న్యాయస్థానం వేదికగా ప్రస్తావించారు. తనకు పరిచయం ఉన్న ఒక వయోవృద్ధురాలిని ఇటీవల సైబర్ కేటుగాళ్లు అత్యంత చాకచక్యంగా బురిడీ కొట్టించారని జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. తాము సీబీఐ, పోలీసు అధికారులమంటూ నమ్మబలికి, వీడియో కాల్స్ ద్వారా ఆమెను వర్చువల్ విధానంలో ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఆ వయసులో ఎటూ తేల్చుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆ వృద్ధురాలు, కటకటాల పాలు కావాల్సి వస్తుందన్న భయంతో తన జీవితకాల కష్టార్జితమైన రిటైర్మెంట్ సొమ్ము మొత్తాన్ని నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసి సర్వస్వం కోల్పోయారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హేయమైన చర్యల వల్ల ఎంతోమంది వృద్ధులు, సామాన్యులు తమ జీవితకాల పొదుపును క్షణాల్లో కోల్పోతున్నారని ఆయన గుర్తుచేశారు.
దేశంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న ఈ డిజిటల్ అరెస్టుల మహమ్మారి కట్టడికి సుప్రీంకోర్టు నడుంబిగించింది. సామాజిక మాధ్యమాలు, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించి, మే 12వ తేదీన ఈ అంశంపై సుదీర్ఘమైన, సమగ్రమైన విచారణ చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను మరింత అప్రమత్తం చేసి, ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించే దిశగా ఆ రోజున అత్యున్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.







