- ఐఏఎస్ రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు
- 3 నెలల్లో తేల్చాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- కాళేశ్వరం కాంట్రాక్టర్లతో కుమార్తె పెళ్లి చేశారని రజత్ కుమార్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ, మహా : తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు లో తాజాగా కీలక విచారణ జరిగింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదును 3 నెలల్లోగా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల నిధులతో రజత్ కుమార్ తన కుమార్తె పెళ్లి జరిపారని, అది నిబంధనలకు విరుద్ధమని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ దాఖలై ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాజాగా ఢిల్లీ హైకోర్టు స్పందించింది.
గతంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ రజత్ కుమార్.. తన కుమార్తె వివాహాన్ని హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 5 రోజుల పాటు చాలా గ్రాండ్‌గా జరిగిందని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ పెళ్లి ఖర్చులను కొన్ని షెల్ కంపెనీల ద్వారా చెల్లించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. తాను మొదట డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ)కి ఫిర్యాదు చేసినట్లు గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆ ఫిర్యాదును తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి డీఓపీటీ పంపించింది. అయితే ఈ ఫిర్యాదుపై తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ విచారణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు గవినోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత కాలపరిమితిలోగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేసి 4 ఏళ్లు గడుస్తున్నా ఆరోపణలపై ఎలాంటి విచారణ లేదా దర్యాప్తు జరగలేదని పిటిషనర్ తరపు లాయర్ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు.







