డెహ్రాడూన్,మహా.
మంచు శిఖరాల నడుమ, గంగమ్మ జలపాతాల సాక్షిగా కొలువై ఉన్న ఆ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. కేదార్‌నాథ్ ధామం భక్తుల దర్శనార్థం ముస్తాబైంది. శీతాకాలపు ఆరు నెలల సుదీర్ఘ నిద్ర తర్వాత, కేదారేశ్వరుడు నేడు ఉదయం 8 గంటలకు భక్తులకు సాక్షాత్కరించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, డమరుక నాదాలు, శంఖారావాల నడుమ ఆలయ ప్రధాన ద్వారాలను శాస్త్రోక్తంగా తెరిచేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. రేపు తెల్లవారుజాము నుండే పవిత్ర గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులను ‘ఓం నమశ్శివాయ’ స్మరణల మధ్య లోనికి అనుమతించనున్నారు.
ఈ అద్భుత ఘట్టం కోసం కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. భక్తి పారవశ్యం వెల్లివిరిసేలా సుమారు 51 క్వింటాళ్ల విదేశీ మరియు స్వదేశీ రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పసుపు, తెలుపు, ఎరుపు రంగుల బంతి పూలు, గులాబీలు, గెర్బెరా పూలతో నిండిన కేదారినాథుని ఆలయం వెండి కొండల మధ్య ఒక స్వర్గధామాన్ని తలపిస్తోంది. శీతాకాలంలో ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలందుకున్న బాబా కేదార్నాథ్ ‘పంచముఖి డోలీ’ ఇప్పటికే కాలినడకన బయలుదేరి గౌరీకుండ్ దాటుకుని నేడు సాయంత్రానికి కేదారినాథ్ ధామానికి చేరుకుంది. ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో హిమాలయ పర్వత శ్రేణులను మారుమోగించారు.
చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటికే అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోగా, రేపు కేదార్‌నాథ్ తెరుచుకోవడం భక్తులకు పండగలా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. యాత్రికుల కోసం వైద్య సదుపాయాలు, మంచినీరు, బస మరియు భద్రతను పర్యవేక్షించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని తరుణంలో, యాత్రికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు ఉదయం కేదారయ్య తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో, హిమగిరులన్నీ ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి భక్తులు ఇప్పటికే కేదార్‌పురికి చేరుకోవడంతో అక్కడ ఆధ్యాత్మిక కోలాహలం గరిష్ట స్థాయికి చేరింది.








