హైదరాబాద్, మహా.
ఆర్టీసీలో కొనసాగుతున్న సమ్మెపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. కార్మికులు తక్షణమే తమ పంతాన్ని వీడి సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేనిపక్షంలో కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ నాగిరెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం నిబంధనలను ఈ సందర్భంగా యాజమాన్యం గుర్తు చేస్తూ, ఏదైనా వివాదం పెండింగ్‌లో ఉన్న సమయంలో సమ్మెకు దిగడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విధులకు గైర్హాజరవుతూ సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొంది.
చట్టవిరుద్ధమైన ఈ సమ్మెలో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి ‘నో వర్క్ – నో పే’ నిబంధన కింద వేతన కోత విధిస్తామని యాజమాన్యం వెల్లడించింది. దీనితో పాటు సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని తేల్చి చెప్పింది. సంస్థ ఆర్థిక పరిస్థితిని, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. అక్రమ సమ్మెల వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, కార్మికుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, కార్మికులు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థకు సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాలను పక్కన పెట్టి, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా సమ్మెకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. విధులకు హాజరయ్యే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, మొండిగా సమ్మెను కొనసాగిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.








