Mahaa Daily Exclusive

  నిరుపయోగ వారధులకు మోక్షం…

Share

* రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం.
*జూన్ 8 కల్లా పనులు పూర్తి కావాలి.
* నిధుల విడుదలకు మంత్రుల ఉపసంఘం ఆమోదం.
*1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపండి.
* అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశం.
హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో నిర్మాణం పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా మారిన బ్రిడ్జిలకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆయన అధ్యక్షతన ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్యాపిటల్ వర్క్స్’ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్ల క్రితమే వంతెనలు నిర్మించినా, కేవలం అప్రోచ్ రోడ్లు లేకపోవడం వల్ల అవి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనుల కోసం రూ. 148 కోట్ల నిధుల విడుదలకు ఉపసంఘం పచ్చజెండా ఊపింది.
నిధుల మంజూరు, పనుల అమలులో జాప్యాన్ని నివారించేందుకు డిప్యూటీ సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు పంపే ప్రతిపాదనలు 1:4 నిష్పత్తిలో ఉండాలని, అప్పుడే సబ్ కమిటీలు వాటిని త్వరితగతిన చర్చించి ఆమోదించడం సులభమవుతుందని స్పష్టం చేశారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు ఉంటే పనులు వేగవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దానికి అనుగుణంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనుల గడువుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. జూన్ 8వ తేదీ లోపు రాష్ట్రవ్యాప్తంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని ఆయన గడువు విధించారు. ఈ పనుల ప్రగతిని తాను స్వయంగా ప్రతి వారం సమీక్షిస్తానని, టెండర్ల ప్రక్రియ నుంచి పనుల నాణ్యత వరకు అన్ని అంశాలను పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు రవాణా కష్టాలు తీరడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.