తెలంగాణ పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన.
* రాష్ట్రంలో 30 మంది ఉన్నతాధికారుల బదిలీ.
* పరిపాలన పరుగులు పెట్టించేలా అధికారుల బదిలీలు.
* కీలక శాఖల్లో ఉన్నతాధికారులకు స్థాన చలనం.
* సీనియర్లకు కీలక బాధ్యతలు.
* యువ అధికారులకు అదనపు విధులతో సర్కార్ కొత్త వ్యూహం.
హైదరాబాద్, మహా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధిని కాంక్షిస్తూ ఐఏఎస్ అధికారుల విభాగంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.. పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన చేపడుతూ ఏకంగా 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, సబ్-కలెక్టర్ల వరకు ఈ బదిలీల పర్వం కొనసాగింది. శాఖల వారీగా సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
**సీనియర్ అధికారులు, కార్యదర్శుల బదిలీలు ఇలా**
ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారుల స్థాయిలో పలువురికి స్థానచలనం కలిగింది. పీఆర్&ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎస్ఏడీ శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ కుమార్ (1995 బ్యాచ్)ను న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎల్ఈటీ&ఎఫ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం.దాన కిషోర్‌కు పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖల బాధ్యతలను అప్పగించింది. అలాగే టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి, ఎస్సీడీ కమిషనర్‌గా సేవలు అందిస్తున్న బి.విజియేందిరను ఎస్సీడీ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది. ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఉన్న కృష్ణ ఆదిత్య ఎస్ ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా పంపగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సంతోష్ బి.ఎం. కు అదే శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
**కలెక్టర్ల బదిలీల వివరాలు**
జిల్లాల స్థాయిలో పలువురు కలెక్టర్లకు స్థానచలనం కల్పించడంతో పాటు, కొత్తవారికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్‌గా ఉన్న హరిచందన దాసరిని ఎల్ఈటీ&ఎఫ్ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ప్రియాంక అలాకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఐటీఈ&సీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న భావేష్ మిశ్రాను నిర్మల్ కలెక్టర్‌గా నియమించగా, నిర్మల్ కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌ను ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పంపారు.
నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఉన్న బధావత్ సంతోష్‌ను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేయగా ఆ స్థానంలో జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా నియమించారు. సంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న పి.ప్రవీణ్యను టీఆర్&బీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసి, నారాయణపేట్ కలెక్టర్‌గా ఉన్న ప్రతీక్ జైన్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా పంపారు. ఇక ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న చెక్క ప్రియాంకను నారాయణపేట్ కలెక్టర్‌గా నియమించారు. ములుగు కలెక్టర్‌గా ఉన్న దివాకర టీఎస్‌ను ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టిని ఐటీఈ&సీ శాఖ ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా నియమించగా, జీహెచ్ఎంసీ సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న భోర్ఖాడే హేమంత్ సహదేవరావును ములుగు జిల్లా కలెక్టర్‌గా పంపారు.
**కమిషనర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రాజెక్ట్ అధికారుల మార్పులు**
వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, జోనల్ కమిషనర్ల స్థాయిలోనూ భారీగా మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్న పి.ఉదయ్ కుమార్‌ను జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేసి, ఆ స్థానంలో పౌర సరఫరాల డైరెక్టర్‌గా ఉన్న జెండాగే హనుమంత్ కొండిబాను ఆరోగ్యశ్రీ సీఈఓగా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉన్న జి.వి.శ్యాం ప్రసాద్ లాల్‌కు పౌర సరఫరాల డైరెక్టర్‌గా స్థానచలనం కల్పించారు. జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్‌గా ఉన్న జి.ముకుంద రెడ్డిని ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్, జీఏ(ఐ&పీఆర్) శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు.
జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న మండ మకరందును ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న అపూర్వ్ చౌహాన్‌ను సీసీఎల్ఏ కార్యాలయంలో సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉన్న లెనిన్ వత్సల్ టోప్పోను ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్‌గా ఉన్న నారాయణ అమిత్ మాలెంపాటిని జీహెచ్ఎంసీ సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా, బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతోను జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా, కాటారం సబ్-కలెక్టర్ మయాంక్ సింగ్‌ను జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా, ఉట్నూర్ సబ్-కలెక్టర్ యువరాజ్ మార్మట్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. చివరగా జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఉన్న నాన్-కేడర్ అధికారి ఎస్.శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.








