Mahaa Daily Exclusive

  మగువకు రక్షణ.. రాష్ట్రానికి ప్రగతి

Share

  • మగువకు రక్షణ.. రాష్ట్రానికి ప్రగతి
  • ఐసీసీసీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
  • డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే వదిలేది లేదు
  • ఈగిల్ ఫోర్స్ కఠిన చర్యలు
  • మహిళా సాధికారతతోనే ‘ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ లక్ష్యం
  • అపోలో నూతన ఆసుపత్రి ప్రారంభం

హైదరాబాద్, మహా.
అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు కల్పించే భద్రత, రక్షణే ఆయా దేశాల వేగవంతమైన పురోగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో మహిళల రక్షణకు తమ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతను చాటిచెప్పారు. మహిళలకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించిన ఘనత భారత్‌దేనని, అమెరికా వంటి దేశాల్లో దీనికోసం 150 ఏళ్లు పట్టిందని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రధానిగా, లోక్‌సభ స్పీకర్‌గా, గవర్నర్లుగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని, అదే స్ఫూర్తితో ప్రస్తుతం తెలంగాణలో కూడా మహిళా సాధికారత కోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌తో పాటు ‘స్టాండ్ విత్ హర్’ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అభద్రతకు గురైన మహిళలకు అండగా నిలిచేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ‘స్పందన’ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని, ఇవి బాధితులకు తక్షణమే మానసిక భద్రత కల్పిస్తాయని పేర్కొన్నారు. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కంటే, అసలు సమస్యే తలెత్తకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత అందరిపైనా ఉందని ఆయన ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామని, గత 28 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. దీనివల్ల ఆడబిడ్డలకు సమానమైన మొత్తం ఆదా అయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్థిక స్వాలంబన దిశగా స్వయం సహాయక సంఘాలకు 60 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందజేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు కేవలం రుణాలకే పరిమితం చేయకుండా, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆర్టీసీకి లీజుకు ఇచ్చేందుకు వెయ్యి బస్సులను కొనివ్వడం, వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణ, ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి బాధ్యతలను మహిళలకే అప్పగించామని పేర్కొన్నారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణతో పాటు, 26 లక్షల మంది విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే ఇచ్చామన్నారు. హైటెక్ సిటీ సమీపంలో 1000 కోట్ల విలువైన స్థలంలో ‘మహిళా శక్తి’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, వారి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి అమెజాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం వెల్లడించారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం నెరవేరాలంటే మహిళల భాగస్వామ్యం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్ వంటి రాష్ట్రాలు డ్రగ్స్ వల్ల ఎలా నిర్వీర్యం అయ్యాయో కళ్లముందే కనిపిస్తోందని, తెలంగాణలో ఆ పరిస్థితి రానివ్వబోమని తేల్చి చెప్పారు. పాఠశాలల ముందు గంజాయి విక్రయించే వారిపట్ల, డ్రగ్స్ వాడే వారిపట్ల ‘ఈగిల్ ఫోర్స్’ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఇందులో ఎంతటి పెద్దవారున్నా, సెలబ్రిటీలున్నా, ప్రజాప్రతినిధులు ఉన్నా వదిలిపెట్టకుండా అరెస్టు చేస్తున్నామని, చట్టం ముందు ఎవరూ అధికులు కాదని ఆయన హెచ్చరించారు. పాఠశాలల్లో చేరే సమయంలోనే విద్యార్థులు డ్రగ్స్ తీసుకోమని ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ఇవ్వాలని, నేరగాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం పునరావాస కేంద్రాలను కూడా పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఐసీసీసీ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్స్ నిర్మించిన ‘ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ ను ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణను మహిళల రక్షణకు పర్యాయపదంగా తీర్చిదిద్దుతామని, ఆర్థిక ప్రగతితో పాటు సామాజిక క్రమశిక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Latest