- బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ విశ్వరూపం
- సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సీరియస్ వార్నింగ్!
- టికెట్ కావాలంటే మెంబర్‌షిప్ ఉండాల్సిందే.. లేదంటే ఇంటికే
- సోషల్ మీడియాలో కాదు.. ఫీల్డ్‌లో కనిపించండి: ఎమ్మెల్యేలకు కేసీఆర్ అల్టిమేటం
**హైదరాబాద్, మహా:**
“మెంబర్‌షిప్ లేకపోతే టికెట్ లేదు.. సిట్టింగ్ అయినా సరే ఇంటికే” అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సాక్షిగా నిప్పులు చెరిగిన ఆయన.. సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులివ్వడం కాదు, గ్రామాల్లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని కుండబద్దలు కొట్టారు. 15 రోజుల్లోగా లక్ష్యాలను చేరుకోకపోతే ఎంతటి వారినైనా పక్కన పెట్టేస్తానని, “నేను ఒకసారి చెబితే వెయ్యి సార్లు చెప్పినట్లే” అంటూ ఆయన జారీ చేసిన అల్టిమేటం ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతలకు ఈసారి చావో రేవో తేల్చుకోవాలన్నట్లుగా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఎస్వీఆర్ ప్రక్రియకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేయడంలో జాప్యం జరగడంపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
**31 నియోజకవర్గాలు.. నిమ్మకు నీరెత్తినట్లు నేతలు!**
రాష్ట్రంలోని 31 నియోజకవర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి జాబితా అందకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి పునాది వంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను గాలికొదిలేసిన నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. “ప్రజల్లో ఉండాల్సిన నేతలు గదులకే పరిమితమైతే సహించేది లేదు” అని స్పష్టం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
**టికెట్ కావాలా? అయితే 15 రోజుల్లో లెక్క తేలాలి!**
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. రాబోయే 15 రోజుల్లోగా సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. “వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు మాత్రమే ప్రధాన ప్రామాణికం. కేవలం సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులివ్వడం కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకపోతే ఎంతటి వారినైనా పక్కన పెడతాను. అది సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు” అని కుండబద్దలు కొట్టారు.
**నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే!**
తనదైన శైలిలో నేతలను హెచ్చరిస్తూ.. “నేను ఒకసారి చెబితే వెయ్యి సార్లు చెప్పినట్లే భావించండి” అంటూ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీరియస్ యాక్షన్ ఉంటుందని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మెంబర్‌షిప్ బుక్కులు పట్టుకుని ఊరూరా తిరగకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని కేసీఆర్ సంకేతాలిచ్చారు.







