Mahaa Daily Exclusive

  బెంగాల్‌ ఎన్నికల బరిలో యూపీ ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’…

Share

* రెండో విడత పోలింగ్‌కు ఈసీ కీలక నియామకం.
*స్వేచ్ఛగా, సజావుగా రెండో విడత పోలింగ్‌.
* ఎన్నికల పరిశీలకుడిగా ఐపీఎస్‌ అజయ్‌ పాల్‌ శర్మ.
* కోల్‌కతాలో కేంద్ర బలగాల పహారా.
* పటిష్ఠ భద్రత మధ్య బెంగాల్‌ కురుక్షేత్రం.

కోల్‌కతా,మహా.
పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌ను అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్‌లోని మొత్తం 142 నియోజకవర్గాల్లో ఈనెల 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అత్యంత సమర్థుడైన అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన అజయ్ పాల్ శర్మ సేవలను ఈసీ వినియోగించుకుంటోంది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఆయన, 2011 బ్యాచ్‌కు చెందిన అధికారిగా ఉత్తరప్రదేశ్‌లో అనేక సాహసోపేతమైన ఆపరేషన్లలో పాల్గొని తనదైన ముద్ర వేశారు.
రెండో విడత పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల కమిషన్ మునుపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడు జిల్లాల పరిధిలో మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. కేవలం కోల్‌కతా నగరంలోనే అత్యధికంగా 273 కంపెనీల బలగాలను రంగంలోకి దించడం ఈ విడత ప్రాధాన్యతను చాటిచెబుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులతో పాటు 100 మంది వ్యయ పరిశీలకులను ఈసీ కేటాయించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు (రియల్ టైమ్ మానిటరింగ్) కెమెరాలతో కూడిన డ్రోన్‌లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ రెండో విడతలో సుమారు 3 కోట్ల 64 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 41 వేల పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారాను పెంచడంతో పాటు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అజయ్ పాల్ శర్మ వంటి కఠినమైన అధికారుల నియామకం ద్వారా హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ముగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ, ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ తీర్పును వెల్లడించేలా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.