Mahaa Daily Exclusive

  ఎన్నారైకి నటి అషురెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. బెదిరింపుల ఆడియోలు లీక్!

Share

  • ఎన్నారైకి నటి అషురెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. బెదిరింపుల ఆడియోలు లీక్!
  • రూ.9.5 కోట్ల మోసం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
  • నా మాట వినకపోతే వేధింపుల కేసు పెడతానంటూ హెచ్చరిక
  • వేణుస్వామి సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుందామన్న అషురెడ్డి

హైదరాబాద్, మహా.

పెళ్లి పేరుతో ఎన్నారై ధర్మేంద్ర నుంచి ఏకంగా రూ.9.5 కోట్లు కాజేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటి అషురెడ్డి వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బాధితుడి ఫిర్యాదు మేరకు అషురెడ్డిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసు వ్యవహారంలో ఆమె ఎన్నారై ధర్మేంద్రను తీవ్రంగా బెదిరించిన ఆడియో రికార్డింగులు బయటకు రావడం కలకలం రేపుతోంది. బాధితుడికి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో నటి పెట్టిన షరతులు, చేసిన బెదిరింపులు ఆ ఆడియోలలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
**కోటిన్నర మాత్రమే ఇస్తా.. మిగతావి లైఫ్‌లో సెటిల్ అయ్యాక!**
లీకైన ఆడియోల ప్రకారం.. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంలో అషురెడ్డి తనదైన శైలిలో కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. తాను తీసుకున్న రూ.9.5 కోట్లలో ప్రస్తుతానికి వచ్చే మే నెల నాటికి కేవలం రూ.కోటిన్నర మాత్రమే ఇస్తానని ఆమె తేగేసి చెప్పింది. మిగతా డబ్బులు తాను జీవితంలో పూర్తిగా సెటిల్ అయిన తర్వాతే చెల్లిస్తానని స్పష్టం చేసింది. తాను చెప్పినట్లుగా ఈ ఒప్పందానికి అంగీకరించి డబ్బులు తీసుకుంటే మంచిదని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మేంద్రను హెచ్చరించింది. తన అనుమతి లేకుండా తమ ఇంటికి వచ్చి తన అక్కను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వేధింపుల కేసు పెడతానని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడింది.
**నీ ముఖం చూడటం ఇష్టం లేదు.. రాజీ చేసుకుందాం**
మధ్యలో పెద్ద మనుషులను పెట్టి ఈ వ్యవహారాన్ని తేల్చుకుందామని అషురెడ్డి ఆడియోలో ప్రతిపాదించింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ప్రవీణ అక్క తదితరులతో కలిసి రాజీకి వద్దామని ఆమె సూచించింది. అసలు తనకు ధర్మేంద్ర ముఖం చూడటం ఏమాత్రం ఇష్టం లేదని, ఈ వ్యవహారం గురించి నేరుగా మాట్లాడటం కూడా ఇష్టం లేదని ఆడియోలో దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఏమైనా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలోనే సెటిల్ చేసుకుందామని ఆమె తేల్చి చెప్పింది.
**కారు ప్రమాదం.. బాధితుడికి తల్లి క్షమాపణలు**
ఇదిలా ఉంటే, ఈ వివాదానికి సంబంధించి మరో కీలక ఆడియో కూడా బయటకు వచ్చింది. గతంలో ధర్మేంద్రకు చెందిన కారును అషురెడ్డి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రమాదం విషయమై అషురెడ్డి తల్లి స్వయంగా ధర్మేంద్రకు ఫోన్ చేసి సారీ చెబుతున్న సంభాషణలు కూడా తాజా ఆడియో రికార్డింగ్స్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియోల లీక్‌తో అషురెడ్డి వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ ఆడియోలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.