Mahaa Daily Exclusive

  కరీంనగర్‌లో పట్టపగలే తుపాకుల మోత…

Share

* పీఎంజే జ్యువెలర్స్‌లో సాయుధ దుండగుల బీభత్సం.
* కస్టమర్ల ముసుగులో కరుడుగట్టిన దొంగలు.
* షోరూంలో విచక్షణారహితంగా కాల్పులు.
* మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోనే దోపిడీ.
* ప్రాణాలకు తెగించి పోరాడిన సిబ్బంది.
* ఆభరణాల చోరీకి దుండగుల విఫలయత్నం.

కరీంనగర్, మహా.

ప్రశాంతతకు మారుపేరైన కరీంనగర్ నగరంలో పట్టపగలే తుపాకులు గర్జించాయి. నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ సాయుధ దోపిడీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అచ్చం సినీ ఫక్కీలో వినియోగదారుల ముసుగులో చొరబడిన సాయుధ ముఠా.. ఆభరణాలను దోచుకునే క్రమంలో సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి, జిల్లా జడ్జి క్వార్టర్స్‌కు అత్యంత సమీపంలో, అది కూడా మంత్రి పర్యటన ముగిసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ దారుణం జరగడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనతో నగరంలోని వ్యాపార వర్గాలు, సాధారణ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

**పక్కా పథకం..వినియోగదారుల ముసుగులో ఎంట్రీ**

ఈ భారీ దోపిడీ కోసం దుండగులు ముందుగానే పక్కా రెక్కీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. ఉదయం షోరూం తెరిచిన కాసేపటికే ఐదుగురు సభ్యుల ముఠా అత్యంత వ్యూహాత్మకంగా లోపలికి ప్రవేశించింది. ముందుగా ఒక దుండగుడు లోపలికి వచ్చి 20 గ్రాముల బంగారు చైన్ కావాలని, మోడల్స్ చూపించాలని సిబ్బందిని కోరాడు. అతనికి ఆభరణాలు చూపిస్తున్న సమయంలోనే మరో ఇద్దరు లోపలికి వచ్చి తాము కూడా బంగారం కొనుగోలు చేస్తామని నమ్మించారు. ఆ వెంటనే మిగిలిన ఇద్దరు కూడా వినియోగదారుల్లాగే షోరూంలోకి అడుగుపెట్టారు.

**హిందీ, తెలుగులో సంభాషణలు..క్షణాల్లోనే మారణాయుధాలతో బెదిరింపు**

అలా ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు లోపలికి ప్రవేశించిన తర్వాత వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. లోపల ఉన్న దుండగులు హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడుకుంటూ ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న తుపాకులను బయటకు తీశారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి, ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తూ అందినకాడికి ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు. క్షణాల వ్యవధిలోనే ప్రశాంతంగా ఉన్న షోరూం వాతావరణం భయానకంగా మారిపోయింది.

**ప్రాణాలకు తెగించి పోరాడిన షోరూం సిబ్బంది**

దుండగులు తుపాకులతో బెదిరించినప్పటికీ పీఎంజే జ్యువెలరీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సంస్థ సేల్స్ మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది అత్యంత అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ, దోపిడీని అడ్డుకునేందుకు దుండగులపైకి ఎదురువెళ్లారు. దొంగలను నిలువరించే క్రమంలో సిబ్బందికి, సాయుధ ముఠాకు మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. సిబ్బంది ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు కంగుతిన్నారు.

**విచక్షణారహితంగా కాల్పులు.. రక్తమోడిన ప్రాంగణం**

సిబ్బంది తమను అడ్డుకోవడంతో దుండగులు తీవ్ర ఆగ్రహానికి గురై వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలై రక్తపు మడుగులో కుప్పకూలారు. సిబ్బంది పోరాటం వల్ల భయాందోళనకు గురైన దుండగులు, తాము ఆభరణాలు నింపుకోవడానికి తెచ్చుకున్న ఒక బ్యాగును ఘటనా స్థలంలోనే జారవిడిచి అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన వారిని తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

**పది నిమిషాల ముందే మంత్రి బండి సంజయ్ పర్యటన**

ఈ ఘటన జరగడానికి కేవలం పది నిమిషాల ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ ప్రాంతంలో పర్యటించడం గమనార్హం. షోరూంకు అతి సమీపంలో ఓ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అప్పటివరకు ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఉంది. మంత్రి అక్కడి నుంచి వెళ్లిన వెంటనే, భద్రతా వలయం తొలగిపోయిన పది నిమిషాల్లోనే దొంగలు ఇంతటి సాహసానికి పాల్పడటం పోలీసు వ్యవస్థనే నివ్వెరపోయేలా చేసింది.

**హుటాహుటిన ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి**

పీఎంజే షోరూంలో కాల్పుల విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తదితరులతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీని స్వయంగా పరిశీలించారు. దుండగులను అడ్డుకున్న సిబ్బంది తెగింపును ఆయన అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, అయినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగారని, దుండగులను కచ్చితంగా పట్టుకుంటారనే పూర్తి నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.

**మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు క్షతగాత్రులు**

కాల్పుల్లో గాయపడిన సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యులు కీలక ప్రకటన చేశారు. బుల్లెట్ గాయాలైనప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. అయితే, వారికి మరింత మెరుగైన, అత్యవసర చికిత్స అవసరం కావడంతో మెడికల్ టీం పర్యవేక్షణలో క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించినట్లు మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

**రంగంలోకి పోలీస్ బాస్.. నగరవ్యాప్తంగా జల్లెడ**

సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి షోరూం అంతటా శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా కోర్టు వెనకాల ఉన్న లైన్‌లో, సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్ లభ్యమైనట్లు గుర్తించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధించి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీకి గురైన ఆభరణాల విలువ ఎంతుంటుందనేది పూర్తి విచారణలో తేలనుంది.