Mahaa Daily Exclusive

  ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే….

Share

  • ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే.
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.
  • ప్రజా సమస్యల పరిష్కారానికి విప్ లు నిరంతరం శ్రమించాలి.
  •  వారంలో ఒక రోజు ప్రత్యేక సమయం

హైదరాబాద్‌, మహా.
రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ, శాసనమండలి విప్‌లు కళ్లు, చెవుల వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విప్‌లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో విప్‌ల పాత్ర అత్యంత కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేయడంలో వారు చురుకైన పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. పౌర సమస్యలను పరిష్కరించడమే కాకుండా, ప్రజాభిప్రాయాన్ని తన దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పల్లెల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ఇందుకోసం స్థానిక జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని విప్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆయన ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరేలా చూడటంతో పాటు, ఆయా పథకాల లబ్ధిని ప్రజలకు వివరించడంలో ప్రసార మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.
ప్రభుత్వం ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించడం విప్‌ల బాధ్యతని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. విప్‌లతో నిరంతరం సమన్వయం చేసుకునేందుకు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు వారంలో ఒక రోజు ప్రత్యేకంగా వారికి అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాలను తెలుసుకునే నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.
ఈ కీలక సమావేశంలో పార్టీ ఎంపీ వేం నరేందర్ రెడ్డి తో పాటు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణరావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ తదితరులు హాజరై తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా విప్‌లు ముఖ్యమంత్రికి విన్నవించారు.