Mahaa Daily Exclusive

  ఐపీఎల్‌ టికెట్ల ‘బ్లాక్‌’ దందా బట్టబయలు…

Share

ఐపీఎల్‌ టికెట్ల ‘బ్లాక్‌’ దందా బట్టబయలు.
* అక్రమార్కుల ఆటకట్టించిన పోలీసులు.
* క్లబ్‌ల కోటా నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు.
* మల్కాజ్‌గిరి పోలీసుల మెరుపు దాడులు.
హైదరాబాద్‌, మహా.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ సమరాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న అక్రమ టికెట్ల వ్యాపారానికి పోలీసులు చరమగీతం పాడారు. నగరంలో టికెట్ల కొరతను సాకుగా చూపి, క్రికెట్ ప్రేమికుల జేబులు గుల్ల చేస్తున్న ముఠా గుట్టును మల్కాజ్‌గిరి పోలీసులు రట్టు చేశారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. క్రీడాభిమానుల ఆవేదనను సొమ్ము చేసుకుంటున్న ఈ దందా వెనుక ఉన్న లోతైన మూలాలను అధికారులు వెలికితీస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ క్లబ్‌ల అభివృద్ధి కోసం ఆయా క్లబ్ సెక్రటరీలకు కేటాయించిన టికెట్లు.. క్రీడాకారులకు చేరాల్సింది పోయి అక్రమార్కుల చేతుల్లోకి మళ్లుతున్నాయి. ఒక్కో క్లబ్ సెక్రటరీకి సుమారు 17 టికెట్ల వరకు కేటాయించగా, వాటిని క్రీడాకారులకు అందజేయకుండా దారిమళ్లించి బయట మార్కెట్‌లో భారీ ధరలకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ముసుగులో జరుగుతున్న ఈ దందాలో కొంతమంది పెద్దల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో మాటు వేసిన పోలీసులు, ఆధారాలతో సహా అక్రమార్కులను పట్టుకున్నారు. టికెట్లను అసలు ధర కంటే నాలుగైదు రెట్లు అధికంగా విక్రయిస్తూ సామాన్య అభిమానులను దోచుకుంటున్న తీరును అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పట్టుబడిన వారిని లోతుగా విచారిస్తున్నామని, ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ అక్రమ విక్రయాలతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
క్రీడలను వ్యాపారంగా మార్చి, అక్రమ మార్గాల్లో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ఇటువంటి ముఠాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారిక మార్గాల్లోనే టికెట్లు కొనుగోలు చేయాలని, అక్రమంగా విక్రయించే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. దర్యాప్తు ముమ్మరం చేసిన మల్కాజ్‌గిరి పోలీసులు.. ఈ గొలుసుకట్టు దందాలో మరెవరెవరు ఉన్నారనే కోణంలో వేట కొనసాగిస్తున్నారు.