- పీఎస్ఎస్ పథకంలో మొక్కజొన్న, జొన్నలను చేర్చండి
- వేరుశనగ, పొద్దు తిరుగుు పంటల కొనుగోలు పరిమితిని పెంచాలి
- కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, మహా : ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్)లో మొక్కజొన్న, జొన్నలను చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం సేకరణ పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖలో రాష్ట్రంలో రబీ సీజన్‌లో పండించే వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై ఉన్న 25 శాతం సేకరణ పరిమితిని కేంద్రం ఎత్తివేయాలని తుమ్మల పేర్కొన్నారు. ఈ పరిమితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిగిలిన పంటను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రం ఆర్థిక భారాన్ని మోస్తోందన్నారు. కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా మొత్తం ఉత్పత్తిలో 25 శాతమైన 29,860 మెట్రిక్ టన్నుల శనగలను సేకరించడానికి, అలాగే 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వులను సేకరించడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
అనుమతించిన పరిమితుల మేరకు కొనుగోలు గత వారమే పూర్తయిందని తుమ్మల వెల్లడించారు. రైతుల వద్ద ఇంకా పంట మిగిలి ఉందని, దానిని అమ్మకం కోసం మార్కెట్లకు తీసుకువస్తున్నారని తెలిపారు. కేంద్రం ఆమోదించిన పరిమితులు ఇప్పటికే దాటిపోయినందున.. శనగల సేకరణ పరిమితిని 1,12,077 మెట్రిక్ టన్నులకు, పొద్దుతిరుగుడు పువ్వుల సేకరణను 10,839 మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి తుమ్మల అభ్యర్థించారు. తెలంగాణలో విస్తృతంగా సాగు చేసే మొక్కజొన్న, జొన్నలను పీఎస్ఎస్ పథకంలో చేర్చి, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా సేకరించాలని కూడా మంత్రి డిమాండ్ చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1.121 మిలియన్ల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అన్నారు.
‘3,68,000 ఎకరాల్లో జొన్న సాగు చేయగా, ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. రైతులు జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించారు. మార్కెట్లో లాభదాయక ధరలు లేకపోవడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కోసం 246 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత రబీ సీజన్‌లో కనీస మద్దతు ధర వద్ద సుమారు 3,99,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది.’ అని మంత్రి తుమ్మల తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రం సుమారు 3,76,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించిందని, ఇందుకోసం రూ.902.80 కోట్లు ఖర్చు చేసిందని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని, మొక్కజొన్న, జొన్నలను పీఎస్ఎస్ పరిధిలోకి చేర్చాలని కోరారు. కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 1.489 మిలియన్ మెట్రిక్ టన్నుల (14,899,520 క్వింటాళ్ల) మొక్కజొన్న, 276,000 మెట్రిక్ టన్నుల (276,277 క్వింటాళ్ల) జొన్నను సేకరించడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని, తక్కువ ధరలకు అమ్ముకోవలసిన పరిస్థితిని నివారించవచ్చని తుమ్మల పేర్కొన్నారు.








