గులాబీ గూటిలో గుబులు.
* అధికార కాంగ్రెస్‌ను కాదని కారునే టార్గెట్ చేసిన నయా ‘టీఆర్ఎస్’.
* కేసీఆర్ కోటలో చీలిక.. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కొల్లగొట్టే దిశగా మాస్టర్ ప్లాన్!
* నాడు తండ్రి పెట్టిన పేరు.. నేడు కూతురి పార్టీకి ఆయుధం.
* రేవంత్‌కు సైడ్ ఇచ్చి.. కారు పార్టీలో కంగారు పుట్టిస్తున్న వైనం!
*రాజకీయ చదరంగంలో ‘రివర్స్’ వ్యూహం.
హైదరాబాద్, మహా.
రాజకీయాల్లో ఎవరైనా కొత్త పార్టీ పెడితే సహజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వారి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తారు. కానీ, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన కల్వకుంట్ల కవిత వ్యూహం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా, అత్యంత సంచలనాత్మకంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేయకుండా, బలహీనపడిన తన సొంత పాత పార్టీ అయిన ‘కారు’ (బీఆర్ఎస్) పైనే గురిపెట్టారు. కారు పార్టీలో కంగారు పుట్టిస్తూ, ఏకంగా ఆ పార్టీ పునాదులనే కదిలించేలా కవిత వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ అనాలసిస్‌కు తెరతీశాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ ఆమె వేస్తున్న ఈ రివర్స్ ఎటాక్ పాలిటిక్స్ గులాబీ బాస్‌లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
**కేసీఆర్ ఫామ్ హౌస్.. రేవంత్ హవా.. కవిత పక్కా లెక్కలు!**
ఈ వ్యూహం వెనుక అత్యంత పదునైన రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన ఇమేజ్‌తో ఐకాన్ లీడర్‌గా దూసుకుపోతున్నారు. ఇలాంటి సానుకూల పవనాలు ఉన్న సమయంలో ఆయనను ఢీకొంటే తన కొత్త పార్టీకి అనవసరమైన డ్యామేజ్ జరుగుతుందని కవిత భావించారు. మరోవైపు దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ వరుస పరాజయాలతో ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన ఓటములతో కుదేలైన బీఆర్ఎస్ను ఈ సమయంలో దెబ్బకొడితే సులభంగా రాజకీయంగా ఎదగవచ్చని కవిత అంచనా వేశారు. బలంగా ఉన్న వాడిని కొట్టడం కంటే, బలహీనంగా ఉన్న వాడి స్థానాన్ని ఆక్రమించుకోవడం సులువనే ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను ఆమె అమలు చేస్తున్నారు.
**కారు పార్టీలో కంగారు.. గులాబీ క్యాడర్‌పై దొరసాని వల!**
వరుస ఓటములతో నైతికంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. కిందిస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు, బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ, సరైన దిశానిర్దేశం కరువైంది. సరిగ్గా ఈ అసంతృప్తినే కవిత తన ఆయుధంగా మలుచుకున్నారు. బీజేపీకి నాయకులు ఉన్నా క్షేత్ర స్థాయి కేడర్ లేదు. కాబట్టి నాయకత్వం కోసం వెతుకులాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను, అసంతృప్త గులాబీ నేతలను చేరదీయడం ద్వారా తన కొత్త పార్టీని రాత్రికి రాత్రే బలోపేతం చేసుకోవచ్చన్నది ఆమె వ్యూహం. ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన నేతలకు ఇప్పుడు తానే వల వేస్తూ, కారు పార్టీ బలాన్ని తన కొత్త పార్టీలోకి లాగేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలో తీవ్ర కంగారును పుట్టిస్తున్నాయి.
**ఆధిపత్య పోరాటమా? కేటీఆర్, హరీష్‌లకు డైరెక్ట్ చెక్!**
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నాయకత్వ లేమి, అంతర్గత కలహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాల వార్తలు గులాబీ శ్రేణులను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్న వేళ, తానే అసలైన తెలంగాణ ఆకాంక్షల వారసురాలినని కవిత ముందుకొచ్చారు. అన్న, బావల మధ్య ఆధిపత్య పోరాటంలో నలిగిపోతున్న పార్టీ శ్రేణులకు తన నూతన పార్టీని ఒక ప్రత్యామ్నాయ వేదికగా చూపుతున్నారు. కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలతో దెబ్బతిన్న పార్టీని వదిలేసి, తనకంటూ స్వచ్ఛమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వాన్ని పరోక్షంగా సవాలు చేస్తూ కవిత వేస్తున్న ఎత్తుగడలు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
**మళ్లీ తెరపైకి ‘టీఆర్ఎస్’.. పేరులోనే సగం విజయం!**
కవిత రాజకీయ చతురతకు అత్యుత్తమ నిదర్శనం తన కొత్త పార్టీకి ఎంచుకున్న పేరు. నాడు కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును కాదని ‘బీఆర్ఎస్’గా మారడంతో ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను కోల్పోయింది. సరిగ్గా అదే పాయింట్‌ను క్యాచ్ చేసిన కవిత, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా తన కొత్త పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అనే పేరును ఆమోదింపజేసుకున్నారు. పేరు ఏదైనా ‘టీఆర్ఎస్’ అనే షార్ట్ కట్ ద్వారా తిరిగి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను, ఆనాటి జ్ఞాపకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది కవిత ఆలోచన. తన తండ్రి వదిలేసిన ‘టీఆర్ఎస్’ నామజపాన్ని ఇప్పుడు తాను అందుకుని పేరుతోనే సగం విజయాన్ని సాధించేలా వేసిన ఈ స్కెచ్ కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ.
**యువత, మహిళలే టార్గెట్.. ఎన్జీవోగా మారిన ‘జాగృతి’**
కేవలం రాజకీయ పార్టీని మాత్రమే కాకుండా, సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కవిత వినూత్న అడుగులు వేశారు. ఇన్నాళ్లు రాజకీయాలకు అండగా నిలిచిన ‘తెలంగాణ జాగృతి’ని పూర్తిగా ఒక ఎన్జీవో (NGO)గా మార్చివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై జెన్ జీ (Gen Z) యువతను, మహిళలను, వికలాంగులను లక్ష్యంగా చేసుకుని ‘టీఆర్ఎస్’ రాజకీయాలు చేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు ఉచిత విద్య, ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరరీ ఉద్యోగాలు లాంటి సామాజిక అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఆందోళనల ద్వారా కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా యువత ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు ఒక పక్కా బ్లూప్రింట్ రెడీ చేశారు.
**పన్నెండేళ్ల ఆకాంక్షల అజెండా.. సిద్దిపేట లేదా బోధన్ నుంచి బరిలోకి!**
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా ప్రధాన ఆశయాలు నెరవేరలేదన్నది కవిత ప్రధాన వాదన. రాబోయే 1000 రోజుల్లో కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దానిపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. తన ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట లేదా బోధన్ అని ప్రకటించడం ద్వారా నేరుగా హరీష్ రావు కంచుకోటలోనే పాగా వేసేందుకు ఆమె సిద్ధపడటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అంతర్మథనం మొదలైంది.
**మిత్రులెవరు? శత్రువులెవరు? మారబోతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!**
కవిత వేస్తున్న ఈ పదునైన ఎత్తుగడలు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ క్యాడర్ నిజంగానే కవిత ఆకర్షణకు లోబడి ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) వైపు మొగ్గు చూపితే, రాష్ట్రంలో ప్రధాన విపక్ష హోదా కోసం బీఆర్ఎస్, కవిత పార్టీల మధ్యే సరికొత్త పోరాటం మొదలవుతుంది. ఈ కుటుంబ రాజకీయ యుద్ధాన్ని అధికార కాంగ్రెస్, బీజేపీలు దూరం నుంచి వినోదం చూసే అవకాశం ఉంది. ఏదేమైనా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం లాభం లేదని గ్రహించి, తన సొంత పార్టీ అయిన కారునే లక్ష్యంగా చేసుకుని కవిత సాగిస్తున్న ఈ ‘పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్’ తెలంగాణలో ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్‌గా మిగిలిపోవడం ఖాయం.








