Mahaa Daily Exclusive

  సంచార జాతులకు మహర్దశ…

Share

సంచార జాతులకు మహర్దశ.
* 51 కులాలకు డీఎన్టీ హోదాపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
* వివాదాస్పద కులాల పేర్ల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.
* సామాజిక న్యాయం దిశగా చారిత్రక అడుగు
* ఆర్డీవోల ద్వారా ధ్రువపత్రాల జారీ.
* బీసీ కమిషన్ సిఫార్సులకు సర్కార్ ఓకే
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా మరో చారిత్రక అడుగు వేసింది. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలకు విశేష ప్రయోజనం చేకూర్చేలా బీసీ కమిషన్ చేసిన కీలక సిఫార్సులకు మంత్రి మండలి లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాలుగా గుర్తింపునకు నోచుకోని 51 కులాలను ‘జాతులు, సంచార, అర్ధ సంచార కులాలు’ (డీఎన్టీ)గా గుర్తిస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీఏ కేటగిరీ కింద 49 కులాలకు, బీసీఈ కేటగిరీ కింద రెండు కులాలకు డీఎన్టీ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సీడ్’ పథకానికి అవసరమైన అర్హులను ఎంపిక చేసేందుకు వీలుగా డీఎన్టీ బోర్డు చేసిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.
**విస్తృత అధ్యయనం.. ఆర్డీవోల ద్వారా ధ్రువపత్రాలు**
ఈ చారిత్రక నిర్ణయం వెనుక బీసీ కమిషన్ చేసిన సుదీర్ఘమైన, సమగ్రమైన అధ్యయనం దాగి ఉంది. 51 కులాలను సంచార జాతులుగా గుర్తించే ప్రక్రియలో కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. బహిరంగ విచారణలు చేపట్టి, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సాధకబాధకాలను తెలుసుకుంది. అర్హులైన వారికి ఈ డీఎన్టీ ధ్రువపత్రాలను రెవెన్యూ డివిజనల్ అధికారుల (ఆర్డీవో) ఆధ్వర్యంలో జారీ చేయాలని కమిషన్ ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సు చేసింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు, ఫలాలు నిరుపేద సంచార జాతులకు నేరుగా అందేందుకు మార్గం సుగమమైంది.
**ఆత్మగౌరవానికి పెద్దపీట.. వివాదాస్పద పేర్ల తొలగింపు**
సంక్షేమంతో పాటు సామాజిక గౌరవానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కులాల పేర్ల మార్పుపై ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సమాజంలో పిలవడానికి ఇబ్బందికరంగా ఉండి, ఒక వర్గాన్ని కించపరిచేలా లేదా తిట్టినట్లుగా ఉన్న కులాల పేర్లను తక్షణమే మార్చాలని కేబినెట్ తీర్మానించింది. తరతరాలుగా ఈ పేర్ల వల్ల ఆయా కులాలకు చెందిన వారు విద్య, ఉపాధి, వివాహ సంబంధాలు తదితర సామాజిక అంశాల్లో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ వివక్ష తర్వాతి తరాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందన్న కుల సంఘాల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న సర్కార్, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా నూతన నామకరణాలకు పూర్తి ఆమోదం తెలిపింది.
**సరికొత్త గుర్తింపు.. మారిన కులాల పేర్లు ఇవే**
కొత్త నిర్ణయం ప్రకారం పలు కులాలకు ఎంతో గౌరవప్రదమైన పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్-ఏలో నంబర్ 7గా ఉన్న దొమ్మర కులం పేరును పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ‘గడవంశీయ’గా నామకరణం చేసింది. అదేవిధంగా బీసీఏలో నంబర్ 18గా ఉన్న పిచ్చకుంట్ల పదాన్ని తీసివేసి అత్యంత హుందాగా ‘వంశరాజ్’గా మార్పు చేసింది. బీసీడీలోని నంబర్ 29 కింద ఉన్న శుద్ర కులం పేరును తొలగించి, ఆ స్థానంలో ‘తమ్మాలి’ అనే పేరును చేర్చింది. దశాబ్దాలుగా వివాదాస్పద పేర్లతో కుంగుబాటుకు గురవుతున్న ఆయా వర్గాల ప్రజలకు ఈ తాజా మార్పులు సరికొత్త సామాజిక హోదాను కల్పించనున్నాయి.