Mahaa Daily Exclusive

  రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రంతో కలిసి నడుస్తాం…

Share

రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రంతో కలిసి నడుస్తాం
*ప్రధాని మోదీ పిలుపును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.
* ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.
* పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు.
* వికసిత్ భారత్, విజన్-2047 సాధనలో భాగస్వాములవుతాం.
*మెట్రోపాలిటన్ నగరాల అభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అత్యున్నత లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రగతి సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేసేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఆదివారం ప్రధానితో కలిసి తాను పంచుకున్న వేదిక పూర్తిగా అధికారిక కార్యక్రమమేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. సోమవారం విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి (చిట్‌చాట్)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాష్ట్ర అభివృద్ధిపై తమ ప్రభుత్వ దార్శనికతను, కేంద్రంతో ఉండాల్సిన సమన్వయాన్ని విడమర్చి చెప్పారు.
దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగానే, తెలంగాణ ప్రభుత్వం కూడా ‘విజన్-2047’ పేరుతో అత్యుత్తమ ప్రణాళికలను రచిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ లక్ష్యాలను సాకారం చేసుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కక్ష్యలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ పార్టీలు, వాటి భావజాలాలు, సైద్ధాంతిక నేపథ్యాలు వేరైనప్పటికీ.. రాష్ట్ర మరియు దేశ అభివృద్ధి విషయానికి వస్తే రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చాలన్న మహోన్నత లక్ష్యాన్ని అందుకునేందుకు కేంద్రానికి తమ రాష్ట్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని, సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
“మా పార్టీలు వేరు, మా ఐడియాలజీ వేరు.. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలను పక్కనపెట్టి కేంద్రంతో కలిసి పనిచేస్తాం.”

ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్న వాస్తవాన్ని సైతం ముఖ్యమంత్రి నిక్కచ్చిగా వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి ఎన్నిసార్లు కేంద్ర పెద్దలను కలిసినా, తెలంగాణకు దక్కాల్సినంత మద్దతు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై ఒక స్పష్టమైన, సుదీర్ఘమైన ప్రణాళిక ఉందని, ఆ బ్లూప్రింట్‌ను వివరించేందుకు ప్రధానమంత్రి కనీసం రెండు గంటల సమయం కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పాటు వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా ఒక ‘టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.